ఇక అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సేల్స్ చరిత్రే

ఇక అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సేల్స్ చరిత్రే

ఇకపై తరచుగా వచ్చే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఫెస్టివల్ సేల్, డిస్కౌంట్ సేల్ లు చరిత్ర కానున్నాయి. విదేశీ పెట్టుబడులు ఉన్న ఈ-కామర్స్ సంస్థలపై ప్రభుత్వం నిబంధనల ఉచ్చు బిగించనుంది. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి ఆన్ లైన్ మార్కెటింగ్ సంస్థలు తాము పెట్టుబడులు పెట్టిన కంపెనీల ఉత్పత్తులు అమ్మడాన్ని నిషేధిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. అలాగే ఉత్పత్తి ధరను ప్రభావితం చేసే విధంగా ప్రత్యేక మార్కెటింగ్ ఏర్పాట్లు చేసుకోవడాన్ని కూడా నిషేధించింది. అమ్మకందారులు అందరికీ ఎలాంటీ వివక్ష చూపకుండా సమానమైన సేవలు, సౌకర్యాలు అందించాలని సంస్థలకు సూచించింది. ఆన్ లైన్ రీటైల్ వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని సమీక్షించిన వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ కొత్త ఉత్తర్వులను జారీ చేసింది.

దేశీయ అమ్మకందారుల ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీ చేసింది. విదేశీ పెట్టుబడిదారుల నుంచి భారీ మొత్తాలు పెట్టుబడి రూపంలో రావడంతో ఈ-రీటెయిలర్ల నుంచి స్థానిక రీటెయిలర్లు తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నట్టు మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ కొత్త విధానం ఫిబ్రవరి 1, 2019 నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఈ చర్యలతో ఈ-కామర్స్ సంస్థలు ధరలను ప్రభావితం చేయడాన్ని పూర్తిగా నిరోధించవచ్చని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఈ-కామర్స్ కంపెనీల్లో ఎఫ్ డిఐ మార్గదర్శకాలను మెరుగ్గా అమలు చేసేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు.

ఒక అమ్మకందారు ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ లో ఒక ఈ-మార్కెట్ సంస్థ ద్వారా 25%కి మించి ఉత్పత్తులు అమ్మడాన్ని కొత్త విధానం అనుమతించదు. ఒకవేళ అంతకు మించి అమ్మకాలు జరిగితే అతని ఉత్పత్తుల నిల్వలను ఈ-కామర్స్ సంస్థ నియంత్రిస్తున్నట్టు భావిస్తారని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. అలాగే ఈ-కామర్స్ మార్కెట్ సంస్థ ఏ అమ్మకందారును తన ఉత్పత్తిని కేవలం తన ప్లాట్ ఫామ్ పైనే అమ్మాలని నిర్బంధించరాదని కూడా నోట్ తెలిపింది. ఈ-కామర్స్ సంస్థలు అమ్మకందారులకు అందించే వస్తువుల చేరవేత, గోదాముల్లో నిల్వ, ప్రచారం, మార్కెటింగ్, చెల్లింపులు, పెట్టుబడి, ఇతర సేవలు వంటి అనేక రంగాల పరిశ్రమల్లో ప్రత్యక్ష, పరోక్ష పెట్టుబడి లేదా సాధారణ నియంత్రణ వాటా ఉంటే ఆయా సేవలను వివక్ష రహితంగా, న్యాయబద్ధంగా నిర్వహించాలని సూచించింది. 

ప్రతి ఏడాది ఈ-రీటెయిలింగ్ కంపెనీలు సెప్టెంబర్ 30 నాటికి ఆర్బీఐకి సమర్పించే ఆడిటర్ రిపోర్ట్ తో పాటు గడిచిన ఆర్థిక సంవత్సరంలో మార్గదర్శకాలను పాటించినట్టు ధ్రువీకరణ పత్రాన్ని కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఈ-కామర్స్ సంస్థలు కస్టమర్లకు భారీ డిస్కౌంట్లు ఇస్తుండటంతో తాము నష్టాల పాలవుతున్నామని దేశీయ వ్యాపారులు పెద్దసంఖ్యలో ఫిర్యాదులు చేయడంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.