రాఫెల్ ఫ్రాడ్ పై కీలక సమాచారాన్ని ప్రభుత్వం దాస్తోంది

రాఫెల్ ఫ్రాడ్ పై కీలక సమాచారాన్ని ప్రభుత్వం దాస్తోంది

సుప్రీంకోర్టులో రాఫెల్ పునర్విచారణ పిటిషన్లపై విచారణ ప్రారంభమైంది. తమ వాదనలు వినిపించేందుకు రెండు పక్షాలకు చెరో గంట సమయం ఇస్తున్నట్టు కోర్టు తెలిపింది. ముందుగా సుప్రీంకోర్ట్ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తన వాదన వినిపిస్తూ ప్రభుత్వం చివరగా సమర్పించిన సమాధానంలో కూడా ఒప్పందంలో ప్రమాణ అవినీతి నిరోధక షరతులను ఎందుకు తొలగించారో వివరించలేదని ఆరోపించారు. న్యాయస్థానికి ప్రభుత్వం అందజేసిన తప్పుడు సాక్ష్యాల కారణంగా అందులో చాలా తప్పులు దొర్లాయని, ప్రభుత్వం ఎన్నో రుజువులను తొక్కిపట్టిందని చెప్పారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎదుట ఉంచి, ఆ తర్వాత పార్లమెంటు ముందు ఆ తదుపరి బహిర్గతం చేసినట్టు కాగ్ నివేదిక పేర్కొందని న్యాయస్థానం తీర్పు చెప్పిందని.. ధరల వివరాలను తగ్గించినట్టు ప్రభుత్వం ఎలా చెబుతుందని ప్రశ్నించారు. కమిటీ చివరి సమావేశం ఆగస్ట్ 24న జరిగినట్టు ప్రభుత్వం కోర్టుకు చెప్పిందని, కానీ ఆ తర్వాత జరిగిన మరో సమావేశంలో అవినీతి నిరోధక షరతులతో సహా 8 ప్రమాణ నిబంధనలను తొలగించినట్టు తెలిసిందన్నారు. అయితే ఇది వాస్తవాలను మరుగునపరిచేందుకు, తప్పును కప్పిపుచ్చుకొనేందుకు చేసిన ప్రయత్నంగా భావించాలని ప్రశాంత్ భూషణ్ అన్నారు. ద హిందూ వార్తపత్రిక నుంచి సేకరించిన అఫిడవిట్ ను ఆయన కోర్టుకు సమర్పించారు. ప్రతి ఒప్పందంలో ఉండే షరతుల్లో ఈ అవినీతి నిరోధక షరతుని ఎందుకు తొలగించారో ప్రభుత్వం తన సమాధానంలో పేర్కొనలేదని.. ఈ ఒక్క కారణంతో కోర్టు పర్యవేక్షణలో క్రిమినల్ దర్యాప్తు జరిపించాల్సిన అవసరం వచ్చిందన్నారు. 

 ఆ తర్వాత మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరీ తన వాదనలు వినిపిస్తూ కాగ్ కి అన్ని పత్రాలు సమర్పించినపుడు కోర్టుకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్ట్ కి సమర్పించిన తప్పుడు పత్రాల కారణంగా తీర్పులో తప్పులు దొర్లాయని చెప్పారు. కోర్టు ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసాన్ని ప్రభుత్వం వమ్ము చేసిందని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు పత్రాల ఆధారంగా తీర్పులో పొరపాట్లు జరగడం కేవలం యాదృచ్ఛికం కానే కాదని అరుణ్ శౌరీ వాదించారు. ప్రభుత్వ నోట్  లోని వాక్యాన్ని తీర్పులో పునరుద్ఘాటించినపుడు న్యాయస్థానం విశ్వాసాన్ని ప్రభుత్వం దారుణంగా దెబ్బ తీసిందని తన గుండె బద్దలైందన్నారు. ప్రభుత్వం న్యాయస్థానానికి, దేశానికి క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని పిటిషనర్లలో ఒకరైన సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ డిమాండ్ చేశారు.