పేదలు, రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త

పేదలు, రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త

పేదలు, రైతులపై కేంద్ర ప్రభుత్వం వరాలు కురిపించింది... లాక్‌డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు ప్రకటించింది.. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వివిధ వర్గాలకు మేలు చేసే దిశగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతులకు, పేదలకు ఊరట కల్పించింది. 14 రకాల ఖరీఫ్ పంటలకు మద్దతు ధరను పెంచింది. ప్రస్తుతమున్న కనీస మద్దతు ధర కంటే... రైతులకు 50 నుంచి 83 శాతం అధికంగా మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకున్నారు. వరి మద్దతు ధరను 53 రూపాయలు పెంచారు. దీంతో క్వింటా వరి ధర 1868కు పెరిగింది. . క్వింటా పత్తికి మద్దతు ధర 260 రూపాయలకు పెంచారు. దీంతో క్వింటా పత్తి ధర రూ.5515కు చేరింది.
ఇటీవల ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ పథకానికి రోడ్ మ్యాప్ రూపొందిస్తూ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా కారణంగా ఇబ్బందుల్లో కూరుకుపోయిన రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఎంఎస్‌ఎంఈల కోసం కేటాయించిన 50 వేల కోట్లను ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టినట్టు మంత్రులు తెలిపారు. ఇక నుంచి 10 కోట్ల పెట్టుబడి, 50 కోట్ల ఆదాయం ఉంటే వ్యాపారాలను చిన్న తరహా పరిశ్రమలుగా పరిగణించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. వీధి వ్యాపారులను ఆదుకునేందుకు తక్షణమే పదివేల రూపాయల రుణం ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. దాదాపు 50 లక్షల మంది వీధి వ్యాపారులను ఈ రకంగా ఆదుకోనుంది కేంద్ర ప్రభుత్వం.