హైకోర్టు సంచలన తీర్పు.. అధికారులకు జైలు శిక్ష

హైకోర్టు సంచలన తీర్పు.. అధికారులకు జైలు శిక్ష

మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిన సిద్దిపేట ఆర్డీవో, తొగుట తహశీల్దార్, మల్లన్నసాగర్ సూపరింటెండెంట్ ఇంజినీర్‌కు జైలు శిక్ష ఖరారు చేసింది. తొగుట తహసీల్దార్‌ వీర్‌సింగ్‌, సిద్దిపేట ఆర్డీవో జయచంద్రారెడ్డి, మల్లన్నసాగర్ సూపరింటెండెంట్‌ వేణుకు మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో పాటు ఒక్కొక్కరి రెండు వేల రూపాయల జరిమానా కూడా విధించింది హైకోర్టు. కోర్టు ధిక్కరణకు పాల్పడి మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో పనులు చేపట్టినట్లు వీరిపై అభియోగాలున్నాయి.  మల్లన్నసాగర్‌లో ముంపునకు గురైన తొగుట గ్రామ రైతు కూలీలు…. ఆర్అండ్‌ఆర్ ప్యాకేజీతోపాటు పునరావాసం, పునరుపాధి కల్పించకుండా అధికారులు పనులు చేయిస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించారు. తమ అభ్యంతరాలు కోర్టుకు విన్నవించారు. స్థానికంగా ఉండే అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత తమకు సమాచారం ఇవ్వాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది. అయితే, రైతుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా ఇష్టానుసారం వ్యవహరించారు అధికారులు. రైతుల అభ్యంతరాలను పరిష్కరించకుండా... తప్పుడు సమాచారాన్ని కోర్టుకు ఇచ్చారు. దీనిపై మరోసారి హైకోర్టు మెట్లెక్కారు రైతులు... ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది హైకోర్టు.. అధికారులకు జైలు శిక్ష, జరిమానా విధించింది.