పెట్టుబడిదారులకు బంపరాఫర్‌..!

పెట్టుబడిదారులకు బంపరాఫర్‌..!

జమ్మూ కశ్మీర్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది నరేంద్ర మోడీ  సర్కార్.. ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో పాటు.. జమ్మూ కశ్మీర్ పునర్విభజనకు పూనుకుంది. ఆ తర్వాత ఉద్రిక్తతలు తలెత్తినా.. ఆంక్షలు పెట్టి క్రమంగా సడలిస్తూ వస్తోంది. మరోవైపు కశ్మీర్, లడఖ్‌ పునర్నిర్మాణం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది కేంద్రం. ఇక్కడ సంస్థల ఏర్పాటు, పెట్టుబడుల ఆకర్షణ కోసం బంపరాఫర్లు ప్రకటిస్తోంది. దానిలో భాగంగా.. ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టేవారికి ఏడేళ్లపాటు పన్ను, జీఎస్టీ మినహాయింపు ఇచ్చే దిశగా నరేంద్ర మోడీ సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఇక, తాము కశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టేవారికి కల్పించే సదుపాయాలను వివరించి.. పెట్టుబడులను ఆకర్షించాలనే ఉద్దేశంతో త్వరలోనే కశ్మీర్‌లో పెట్టుబడుల సదస్సు నిర్వహించడానికి నీతి ఆయోగ్ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు పారా మిలటరీ బలగాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీని కోసం అక్కడి పరిస్థితులు అధ్యయం చేసేందుకు ప్రత్యేక బృందాన్ని కూడా  పంపనుంది కేంద్రం. కాగా, జమ్మూ కశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనూహ్యంగా మద్దతు లభించింది. మొదట్లో వ్యతిరేకించినవారు సైతం క్రమంగా మోడీ సర్కార్‌కు సపోర్టు చేయడం విశేషం.