సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాలకు ఆధార్ ఐచ్ఛికం?

సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాలకు ఆధార్ ఐచ్ఛికం?

సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాలకు ఆధార్ ఐచ్ఛికం కానుంది. బ్యాంకు ఖాతాలు తెరవడానికి, మొబైల్ ఫోన్ కనెక్షన్ వంటి సేవలు పొందేందుకు గుర్తింపు కార్డుగా ఆధార్ ను ఉపయోగించడం వ్యక్తుల ఇష్టానికి వదిలేసే బిల్లును కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్ సభలో ప్రవేశపెట్టింది. ఆధార్, టెలికామ్ రంగం, బ్యాంకింగ్ రెగ్యులరేషన్లను నియంత్రించి మూడు వేర్వేరు చట్టాల్లో ఈ బిల్లుతో మార్పు చేయనున్నారు. 18 ఏళ్ల వయసు ఉన్నవారు 12 అంకెల గుర్తింపు పథకం నుంచి వైదొలిగే అవకాశాన్ని కూడా ఈ కొత్త బిల్లు కల్పించనుంది. ఆధార్ వినియోగానికి విధించిన నియమాలను ఉల్లంఘిస్తే భారీ జరిమానాలను విధించే అవకాశాన్ని కూడా ఈ బిల్లు కల్పిస్తుంది.

ఆధార్ ఇతర చట్టాల (సవరణ) బిల్లు 2018ని న్యాయశాఖ, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ధ్రువీకరణ కోసం స్వచ్ఛందంగా ఆధార్ ఐడీని ఇచ్చిన వ్యక్తుల బయోమెట్రిక్ సమాచారాన్ని సర్వీస్ ప్రొవైడర్లు సేకరించి భద్రపరచడాన్ని ఈ బిల్లు నిషేధిస్తుంది. ఆధార్ ఇవ్వని వ్యక్తులకు బ్యాంకు ఖాతాలు లేదా సిమ్ కార్డ్ వంటి ఏ సేవలనైనా నిరాకరించరాదని ఈ బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారు. 

ఆధార్ (ఆర్థిక, ఇతర సబ్సిడీలు, ప్రయోజనాలు, సేవల కోసం ఉద్దేశించిన) చట్టం, 2016, ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, 1885, మనీ లాండరింగ్ నిరోధక చట్టం, 2002లో మార్పుల కోసం ఈ బిల్లు ఉద్దేశించబడింది. టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లు ఆధార్ ను ధ్రువీకరణకు ఉపయోగించడం మాత్రమే కాకుండా పాస్ పోర్ట్, ఇతర అధికారిక గుర్తింపు పత్రం, కేంద్ర ప్రభుత్వం పేర్కొన్ని ఇతర గుర్తింపు ప్రత్యామ్నాయాలు వంటి ఆఫ్ లైన్ వెరిఫికేషన్ నుంచి ఈ బిల్లు మినహాయింపు ఇస్తుంది. ఈ బిల్లు 12 అంకెల వాస్తవ ఆధార్ సంఖ్యను దాచిపెట్టి దాని ప్రత్యామ్నాయ అంకెలను ఇచ్చే విధంగా మార్పులు చేయాలని ఈ కొత్త బిల్లు సూచిస్తోంది. 

వ్యక్తిగత గోప్యత గురించి ప్రతిపక్షాల ఆందోళనలపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ ఆ గీతను అతిక్రమించేది లేదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఈ బిల్లును రూపొందించినట్లు తెలిపారు. ఆధార్‌ సంఖ్యను మొబైల్ నంబరు, బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేయడం తప్పనిసరి కాదన్నారు. ఆధార్‌ చట్ట నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై ఏకంగా రూ.కోటి దాకా పెనాల్టీ విధించడంతో పాటు నిబంధనలు పాటించే దాకా ప్రతి రోజు రూ.10 లక్షల దాకా అదనంగా జరిమానా విధించే ప్రతిపాదనలను కేంద్రం  రూపొందించింది. విశిష్ట గుర్తింపు సంఖ్యల ప్రాధికార సంస్థకు (యూఐడీఏఐ) మరిన్ని అధికారాలు కల్పించే దిశగా ఆధార్‌ చట్టానికి కేంద్రం సవరణలు చేయనున్నట్లు తెలిసింది.