ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాల అమ్మే యోచనలో సర్కార్

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాల అమ్మే యోచనలో సర్కార్

పెట్టుబడుల ఉపసంహరణ జోరు పెంచే యోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా స్టేట్ బ్యాంక్ ఇండియా (ఎస్బీఐ) సహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీలు) తన వాటాలు అమ్మేందుకు సిద్ధమవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.80,000 కోట్లుగా ఉన్న పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.90,000 కోట్లయింది. మొన్న తాత్కాలిక బడ్జెట్ లో ప్రకటించిన ఉపసంహరణ ప్రణాళికలో ఇటీవల కొన్నేళ్లుగా పీఎస్బీలలో పెరుగుతూ వస్తున్న ప్రభుత్వ వాటాల అమ్మకం కూడా ఉన్నట్టు ఎకనామిక్ టైమ్స్ తన కథనంలో తెలిపింది. 

‘మూడు నాలుగు బ్యాంకులు మంచి ఫలితాలు కనబరిచాయి. అవి నిలకడైన పనితీరు కనబరిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ముగిసే నాటికి అలాంటి వాటిలో వాటాల అమ్మకాన్ని పరిశీలించవచ్చు’ అని ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారి ఒకరు చెప్పినట్టు ఈటీ పేర్కొంది. మంచి పనితీరు కనబరిచే బ్యాంకుల్లో తన వాటాను 25%కి పరిమితం చేసుకోవాలన్న నిబంధనను పాటించాలని మంత్రిత్వశాక భావిస్తున్నట్టు తెలిసింది.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ సహా పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో  కేంద్రానికి 75%కి పైగా వాటాలు ఉన్నాయి. పీఎస్బీలలో తన వాటా తగ్గించుకొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్ మెంట్ (దీపమ్) కార్యదర్శి అతను చక్రబొర్తి చెప్పారు. గత ఏడాది బ్యాంకుల పనితీరు గొప్పగా లేనందువల్ల అలాంటి ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించలేదన్నారు. ‘ప్రభుత్వం తాను పెట్టిన పెట్టుబడులను ఉపసంహరించుకొని ప్రైవేట్ పెట్టుబడులు, రీటైల్ పెట్టుబడులకు అవకాశం ఇవ్వాలనుకుంటోంది. దానిని కొట్టేపారేసేందుకు కారణాలేవీ లేవని’ ఆయన అన్నారు. ఈ ఏడాది పెట్టుకొన్న రూ.90,000 కోట్ల పెట్టుబడులు ఉపసంహరణ లక్ష్యం సాధ్యమేనని విశ్వాసం వ్యక్తం చేశారు. 

ప్రభుత్వం ఐడిబిఐ బ్యాంకు నుంచి వైదొలగాలనే నిర్ణయానికి వచ్చినట్టు ఈటీ తన కథనంలో తెలిపింది. ప్రభుత్వానికి ఈ బ్యాంకులో 52% వాటాలు ఉన్నాయి.