నా ఛానెల్ ప్రసారాలను ప్రభుత్వం నిలిపేసింది

నా ఛానెల్ ప్రసారాలను ప్రభుత్వం నిలిపేసింది

జనవరి 26న ప్రారంభమైన హార్వెస్ట్ టీవీ ప్రసారాలు రెండు రోజులకే నిలిచిపోయాయి. నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన హార్వెస్ట్ టీవీ ఛానెల్ ప్రసారాలను నిలిపేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ ఆరోపించారు. హెచ్ టిఎన్ న్యూస్ గా వ్యవహరించే హార్వెస్ట్ టీవీలో కీలకపాత్ర పోషిస్తున్న సిబాల్, ఇందుకు కేంద్ర ప్రభుత్వమే కారణమని దుయ్యబట్టారు. నరేంద్ర మోడీ సర్కార్ సూచనల కారణంగా తమకు డీటీహెచ్ ఆపరేటర్లు, కేబుల్ ఆపరేటర్ల నుంచి సమస్యలు ఎదురవుతున్నాయని విమర్శించారు. ‘ఈ మధ్యాహ్నం నుంచి మా ఛానెల్ హార్వెస్ట్ ప్రసారాలను ప్రభుత్వం ఆపేసింది. మా ఛానెల్ ను ప్రసారం చేయొద్దంటూ వాళ్లు టాటా స్కైకి సూచించారు’ అని సిబాల్ జైపూర్ లో తెలిపారు. కపిల్ సిబాల్ ఒక ప్రమోటర్ గా ఉన్న హార్వెస్ట్ టీవీ 26 జనవరి 2019 నుంచి ప్రసారాలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. వీకాన్ మీడియా యాజమాన్యంలో నడిచే ఈ ఇంగ్లిష్ న్యూస్ చానెల్ లో ప్రముఖ జర్నలిస్టులు బర్ఖా దత్, కరణ్ థాపర్, సీమీ పాషా, వినీత్ మల్హోత్రా వంటివారు కనిపించనున్నారు.