డాక్టర్లపై దాడి జరిగితే ఆస్పత్రి ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి

డాక్టర్లపై దాడి జరిగితే ఆస్పత్రి ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి

వైద్య సిబ్బందికి ఊరటనిచ్చే నిబంధన తెచ్చింది ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ ప్రభుత్వం. ఢిల్లీలోని ఆస్పత్రులు/వైద్య సంస్థల పరిసరాల్లో రోగులు లేదా వారి అటెండెంట్లు వైద్య సిబ్బందిపై ఏ విధమైన దాడి లేదా హింసాకాండకు పాల్పడితే సంబంధిత ఆస్పత్రుల యాజమాన్యాలు/వైద్యాధికారులు వెంటనే ఎఫ్ఐఆర్/ఫిర్యాదు నమోదు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. అలాంటి కేసుల్లో డాక్టర్/పారా-మెడికల్/నర్సింగ్/పరిపాలన సిబ్బంది, ఇతరులను వ్యక్తిగతంగా పోలీ ఎఫ్ఐఆర్/ఫిర్యాదు ఇవ్వాలని ఎట్టి పరిస్థితుల్లోనూ సూచించ రాదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను మంగళవారం ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సంజీవ్ ఖిర్వార్ జారీ చేశారు. 

అన్ని హాస్పిటళ్లు, వైద్య సంస్థలలో డాక్టర్ లేదా స్టాఫ్ పై రోగీ లేదా అటెండెంట్లు దురుసుగా ప్రవర్తించినా/దాడి చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయించాల్సిన బాధ్యత ఆస్పత్రి హెచ్ఓడీలదేనని ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆస్పత్రి రెసిడెంట్ డాక్టర్/పారామెడికల్ స్టాఫ్/నర్సింగ్/పరిపాలన సిబ్బందిని ఒంటరిగా ఎఫ్ఐఆర్/ఫిర్యాదు చేసేందుకు పంపరాదని స్పష్టం చేశారు. ఆదేశాల ప్రకారం చర్యలు చేపట్టకపోతే సంబంధిత ఆస్పత్రి హెచ్ఓడీ/ఎంఎస్ లు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. వారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపింది. ఢిల్లీ ఆప్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఢిల్లీలోని ఆస్పత్రులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.