ప్రభుత్వం చేతికి ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌

ప్రభుత్వం చేతికి ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ను కేంద్ర ప్రభుత్వం తన అజమాయిషీ లోకి తీసుకుంది. ఈ సంస్థ కారణంగా మొత్తం ఫైనాన్షియల్‌ రంగం సంక్షోభంలో పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ముంబైలోని నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో ఈ కేసు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఐఎల్‌ అండ్ ఎఫ్‌ఎస్‌ సంస్థను టేకోవర్ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. ఇపుడున్న బోర్డు స్థానంలో కొత్త బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదనను  ఎన్‌సీఎల్‌టీ ఎదుట పెట్టింది ప్రభుత్వం. ఈ ప్రతిపాదనకు ఎన్‌సీఎల్‌టీ అంగీకరించింది. ఇక నుంచి ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ను ఆరుగురు సభ్యులు గల కొత్త బోర్డు నిర్వహిస్తుంది. ఈ కంపెనీకి కొటక్ మహీంద్రా బ్యాంక్‌  మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఉదయ్‌ కొటక్‌ను మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమించారు. కంపెనీ బోర్డులో ఉదయ్‌ కొటక్‌తోపాటు మాజీ ఐఏఎస్‌ ఆఫీసర్‌, టెక్‌ మహీంద్రా సీఈఓ అయిన వినీత్‌ నాయర్‌, సెబీ మాజీ చీఫ్‌ జీఎన్‌ బాజ్‌పేయి, ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఛైర్మన్‌ జీసీ చతుర్వేది., మాజీ ఐఏఎస్‌ ఆఫీసర్లు మాలిని శంకర్‌, నంద కిశోర్‌లను నియమించారు.  కొత్త బోర్డు ఈనెల 8న సమావేశం కానుంది. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంస్థకు సొంతంగా రూ. 16,500 కోట్ల రుణం, తన అనుబంధ కంపెనీలతో కలిపి రూ.91,000 కోట్ల రుణం ఉంది. రుణ ఊబిలో కూరుకుపోయిన ఈ సంస్థను సత్యం తరహాలో పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తోంది.