తిత్లీ బాధితులకు అండగా ఉంటాం: ఏపీ సీఎం

తిత్లీ బాధితులకు అండగా ఉంటాం: ఏపీ సీఎం

తిత్లీ తుపానుతో శ్రీకాకుళం జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. వజ్రపు కొత్తూరు మండలంలోని గరుడభద్రలో పర్యటించి, అక్కడి బాధితులకు ధైర్యం చెప్పారు. ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట ప్రాంతాల్లో ఈ రోజు సాయంత్రంలోగా విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని తెలిపారు. 30వేల విద్యుత్ స్థంబాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అన్నారు. తిత్లీ తుపానుతో నష్టపోయిన వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని స్పష్టం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని వెల్లడించారు. బాధితులకు ఎలాంటి అవసరం వచ్చినా అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.

ఓ వైపు సహాయక చర్యలు చేపడుతుంటే వైసీపీ, జనసేన పార్టీలు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. పక్క జిల్లాలోనే పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు జగన్ కనీసం పరామర్శకు అయినా వచ్చాడా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా తమకు రేషన్ ఇవ్వలేదని సీఎం కు గరుడభద్ర గ్రామస్ధులు ఫిర్యాదు చేశారు. ఏ ఒక్కరికీ ఉచిత రేషన్ అందలేదన్న ఫిర్యాదు రాకూడదని అధికారులను హెచ్చరించారు.  కష్టాల్లో ఉన్న ప్రజలను పట్టించుకోకుండా కేంద్రం వ్యహరిస్తుందని సీఎం చంద్రబాబు ఆరోపించారు.