భారత్ లో గోజీరో మోబిలిటీ బైక్ లు

 భారత్ లో గోజీరో మోబిలిటీ బైక్ లు

బ్రిటిష్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌, లైఫ్‌స్టైల్‌ బ్రాండ్‌ ‘గోజీరో మొబిలిటీ’ భారత్‌లోకి ప్రవేశించింది. మైల్‌, వన్‌ పేర్లతో రెండు విద్యుత్‌ బైక్‌లను ఢిల్లీ మార్కెట్లోకి విడుదల చేసింది. మైల్‌ ధర రూ.29,999 కాగా, వన్‌ ధర రూ.32,999గా నిర్ణయించారు. గోజీరో వన్‌ బైక్‌లో 400 వాట్‌అవర్‌(డబ్ల్యూహెచ్‌) లిథియమ్‌ బ్యాటరీని అమర్చామని, గోజీరో మొబిలిటీ సీఈఓ అంకిత్‌ కుమార్‌ తెలిపారు. ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే, 60 కిమీ.దూరం ప్రయాణిస్తుందని పేర్కొన్నారు. గోజీరో మైల్‌ బైక్‌ను 300 వాట్‌అవర్‌ లిథియమ్‌ బ్యాటరీతో రూపొందించామని, ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 45 కిమీ. దూరం ప్రయాణించవచ్చని వివరించారు. ఈ రెండు బైక్‌లతో జాకెట్లు, బెల్ట్‌లు, వాలెట్స్‌ వంటి లైఫ్‌స్టైల్‌ ఉత్పత్తులను కూడా భారత మార్కెట్లోకి విడుదల చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత ఉత్పత్తుల అభివృద్ధికి, భవిష్యత్తు ఉత్పత్తుల కోసం కోల్‌కతాకు చెందిన కీర్తి సోలార్‌ కంపెనీతో గోజీరో మోబిలిటీ ఒప్పందం కుదుర్చుకుంది. విద్యుత్‌తో నడిచే వాహనాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న ప్రస్తుత తరుణంలో దేశీయ మార్కెట్లోకి ప్రవేశించడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. తొలి ఏడాది 3000 మోటారు సైకిళ్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ.. వచ్చే ఐదేళ్లలో ఈ లక్ష్యాన్ని 75 వేలకు పెంచనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటికే తమ కంపెనీలో కీర్తి సోలార్‌ కంపెనీ 2,50,000 డాలర్లు పెట్టుబడులు పెట్టిందని తెలిపారు. ఈ బైకులను విక్రయించడానికి ప్రీమియం రిటైల్ ఔట్‌లెట్లను ఏర్పాటు చేయనున్నామని, తొలి విడుతలో ఢిల్లీ, కోల్‌కతా, గువాహటిలలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.