కలెక్టర్‌, ఎస్పీ కాలర్‌ పట్టుకో..! గొప్ప నాయకుడివి అయిపో?

కలెక్టర్‌, ఎస్పీ కాలర్‌ పట్టుకో..! గొప్ప నాయకుడివి అయిపో?

రాజకీయాల్లో లీడర్ స్థాయికి ఎదగాలంటే ఎన్నో ఒడిదుడుకులు ఎదర్కొని పైకి రావాల్సి ఉంటుంది. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వార్డు మెంబర్ స్థాయి నుంచి మంత్రి పదవి స్థాయికి ఎదిగిన నేతలు ఉన్నారు.. ఎలాంటి కష్టం లేకుండానే వారసత్వంతో రాజకీయాల్లో అడుగుపెట్టినవాళ్లు కూడా ఉన్నారు. అయితే, మంత్రికి ఓ విద్యార్థి నుంచి ప్రశ్న ఎదురైంది.. మీరు మంత్రి స్థాయి వరకు ఎలా ఎదిగారని ప్రశ్నించాడు ఆ విద్యార్థి.. వెంటనే మన మంత్రిగారు ఆ విద్యార్థికి చెప్పిన సమాధానం విని అంతా షాక్ తిన్నారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. 

సుక్మా జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు ఛత్తీస్‌గఢ్‌ మంత్రి కవాసీ లఖ్మా.. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.. ముఖాముఖిలో ఓ విద్యార్థులతో మాట్లాడిన ఆయన.. "మీరు గొప్ప నాయకుడిగా ఎదిగారు. ఇది మీకు ఎలా సాధ్యమైంది? అని ఓ విద్యార్థి తనను ప్రశ్నించాడు.. నేను కూడా మీలా కావాలంటే ఏం చేయాలి? అని సలహా అడిగాడు. విద్యార్థి ప్రశ్నకు తాను ఈ విధంగా సమాధానం ఇచ్చా.. మీరు కూడా కలెక్టర్‌, ఎస్పీ కాలర్‌ పట్టుకుని లాగితే గొప్ప నాయకులు అవుతారని చెప్పానని'' చెప్పుకొచ్చారు మంత్రి గారు. దీంతో అక్కడ నవ్వుల పువ్వులు పూశాయి. మరోవైపు మంత్రి వ్యాఖ్యలపై దుమారం రేగింది.. విద్యార్థులతో ఇలా మాట్లాడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో మరోసారి తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మంత్రి కవాసీ లఖ్మా.. విద్యార్థులు భవిష్యత్‌లో ఏం కావాలని అనుకుంటున్నారు దాని కోసం కృషి చేయాలని చెప్పా.. మీరు రాజకీయ నాయకుడు  ఎలా అయ్యారని నన్ను అడిగారు.. నాయకులు కావాలనుకుంటే ప్రజలకు సేవ చేయమని నేను వారికి చెప్పా.. కలెక్టర్ కార్యాలయాల వద్ద వారి కోసం పోరాడాలని సూచించా.. కానీ, నా స్టేట్‌మెంట్‌ను తప్పుగా ప్రసారం చేశారని మాట మార్చారు.