ప్లాస్టిక్ కవర్లు : కాదంటే షాపులే మూత..

ప్లాస్టిక్ కవర్లు : కాదంటే షాపులే మూత..

గ్రేటర్ హైదరాబాద్ లో కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతున్నది.  కాలుష్య నివారణ కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్ని మార్గదర్శకాలు రూపొందిస్తున్నా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కాలుష్యం తగ్గడం లేదు.  ప్లాస్టిక్ ఉత్పత్తులు, ప్లాస్టిక్ కవర్ల తయారీ సంస్థల నుంచే కాలుష్యం ఎక్కువగా వస్తోంది.  నగరంలో ప్లాస్టిక్ కవర్ల నిషేధంపై ఎన్నో మార్గదర్శకాలను రూపొందించినా అమలుకు నోచుకోలేదు.  దీంతో గ్రేటర్ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమైంది.  ప్లాస్టిక్ కవర్లపై సంపూర్ణ నిషేధం విధించాలనే తీర్మానానికి జీహెచ్ఎంసి ఆమోదం తెలిపింది.  గ్రేటర్ ఆమోదయించిన తీర్మానాన్ని తెలంగాణా రాష్ట్ర సర్కారుకు పంపనున్నారు.  రాష్ట్ర సర్కారు ఆమోదం తెలిపితే నగరంలో ప్లాస్టిక్ కవర్లపై సంపూర్ణ నిషేధం విధించేందుకు మార్గాలు సుగమం అవుతాయి. 

తయారీ సంస్థలు దిగుమతులు చేసుకునే ఉత్పత్తులతో వచ్చే ప్లాస్టిక్ కవర్లకు మినహాయంపు ఇచ్చారు. అలాగే మొక్కల పెంపకానికి సంబంధించి ఉపయోగించే ప్లాస్టిక్ కవర్లను అటవీశాఖ అనుమతితో తయారు చేసుకోవచ్చు. పాలు, పాల ఆధారిత ఉత్పత్తుల కోసం ఉపయోగించే ప్లాస్టిక్ కవర్లకు అనుమతి ఇచ్చారు.  ఇక ప్లాస్టిక్ కవర్లపై విధించిన నిషేధాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే.. జరిమానా భారీగా విధిస్తారట.  మొదటి ఉల్లంఘనకు రూ.25 వేలు, రెండోసారి ఉల్లంఘనకు పాల్పడితే రూ.50 వేలు, మూడోసారి కూడా ఉల్లంఘిస్తే సదరు వ్యాపారి లైసెన్స్ రద్దుచేసి వ్యాపార సంస్థను సీల్ చేస్తారని జీహెచ్ఎంసి పేర్కొంది.