అంగరంగ వైభవంగా పెళ్లి ఊరేగింపు... వరుడు అరెస్ట్... సోషల్ మీడియాలో వైరల్ 

అంగరంగ వైభవంగా పెళ్లి ఊరేగింపు... వరుడు అరెస్ట్... సోషల్ మీడియాలో వైరల్ 

కరోనాకు ముందు సమయంలో పెళ్లి వేడుకలు అంటే ధూమ్ ధామ్ గా చేసుకునేవారు.  బ్యాండ్ మేళాలతో ఊరేగిస్తూ వందలాది మంది డ్యాన్స్ చేస్తూ పెళ్లిని ఓ పండుగలా జరుపుకునేవారు.  కరోనా వచ్చిన తరువాత మొత్తం మారిపోయింది.  పెళ్ళికి చేసుకోవాలి అంటే ఎలాంటి హడావుడి ఉండకూడదు.  సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, కరోనా నిబంధనలు పాటిస్తూ పెళ్లిళ్లు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఊరేగింపుగా వేడుకలు చేసుకుంటూ పెళ్లిళ్లు చేసుకుంటే వారిపై కేసులు పెడుతున్నారు.  అరెస్టులు చేస్తున్నారు.  కారణం కరోనా.  నిబంధనల ప్రకారమే  ఇప్పుడు ప్రతి  ఒక్కరు నడుచుకోవాలి.  కాదని ఉల్లంఘిస్తే వారిపై కరోనా కొరడా ఝుళిపిస్తున్నారు.  ఇలాంటి సంఘటన ఒకటి ఒడిశాలో  జరిగింది.   ఒడిశాలోని గంజాం జిల్లాలో కరోనా నిబంధనలు పాటించకుండా పెళ్లి ఊరేగింపు జరిగింది.  మాస్క్ లు  డిస్టెన్స్ పాటించకుండా ఊరేగింపు నిర్వహించారు.  దీనిపై కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు పెళ్లి ఊరేగింపు నిర్వహించినవారిపై కేసులు పెట్టారు.  పెళ్లి కొడుకును, పెళ్లి కొడుకు తండ్రి, ముగ్గురు మామలను అరెస్ట్ చేశారు.  కరోనా నిబంధనలు పాటించకుండా వివాహం జరిగిన మై ఫెయిర్ హోటల్ ను కూడా పోలీసులు సీజ్ చేశారు.  నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని లేదంటే జైలుకు వెళ్ళక తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.  ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.