పెళ్ళికొడుకు తండ్రితో పెళ్లి కూతురి తల్లి పరారీ...అదో రకం ప్రేమ !

పెళ్ళికొడుకు తండ్రితో పెళ్లి కూతురి తల్లి పరారీ...అదో రకం ప్రేమ !

వినడానికి ఇది వింతగా ఉన్నా ఈ ఘటన నిజంగానే జరిగింది. ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపోకండి ఎందుకంటే మన సినిమాల్లో వింటూనే ఉన్నాం కదా, ప్రేమ ఎక్కడ ఎప్పుడు ఎవరిమీద ఎందుకు ఎలా పుడుతుందో ? చెప్పడం ఆ దేవుడి వలన కూడా కాదు. అలాగే ఈ పెళ్లి కొడుకు తండ్రికి తన కొడుకును ఇచ్చి పెళ్లి చేయబోయే అమ్మాయి తల్లి నచ్చింది. అయితే ఆమెకు కూడా ఈయన గారు నచ్చడంతో పెళ్లి పెటాకులు అయ్యాయి. దానికి కారణం ఈ ఇద్దరూ కలిసి జంప్ అవ్వడమే. అందుతున్న వివరాల ప్రకారం గుజరాత్‌ లోని సూరత్‌కు చెందిన ఒక జంటకు పెళ్లి నిశ్చయించారు.

అంతా సెట్ కావడంతో వచ్చే నెలలో ఘనంగా వివాహం జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లి పనులు అంటే ఇరు కుటుంబాల వారు కలుస్తూ ఉంటారు కదా, అలా కలిసే క్రమంలో ఈ పెళ్లి జరిగితే వరుసకు అన్నాచెల్లెళ్లు అవ్వాల్సిన పెళ్ళికొడుకు తండ్రి, పెళ్లి కూతురు తల్లి ఇద్దరూ ప్రేమలో పడ్డారు. లేటు వయసులో అది కూడా ఇద్దరి బిడ్డలకి పెళ్ళి చేయాల్సిన సమయంలో ఇప్పుడు తమ ప్రేమను ఎవరూ అంగీకరించరన్న భావనతో కుటుంబాలను వదిలేసి ఇద్దరూ పరారయ్యారు.

అయితే ముందు పెళ్లి కూతురి తల్లి కనిపించకపోవడంతో ఆమె కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఈలోగా వరుడు తండ్రి కూడా మిస్సింగ్ కావడంతో అనుమానం వచ్చి లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు నిజం బయటపడింది. వీరిద్దరికి ఎప్పటి నుంచో పరిచయం ఉందని, అదికాస్తా ప్రేమగా మారిందని తేలడంతో అందరూ ఇప్పుడు నోరెళ్లబెట్టారు. తమ బిడ్డల పెళ్లి జరిగితే అన్నాచెల్లెలి వరుసగా మారాల్సి వస్తుందన్న ఆందోళనతో వారిద్దరూ పరారైనట్లు తెలిసింది. ఇది అంతా వింటుంటే హమ్ ఆప్కే హై కౌన్ అనే సినిమా కధ గుర్తు వస్తోంది కదూ.