సిరిసిల్ల టీఆర్‌ఎస్‌లో గ్రూప్‌ తగాదాలు?

సిరిసిల్ల టీఆర్‌ఎస్‌లో గ్రూప్‌ తగాదాలు?

సిరిసిల్ల టీఆర్‌ఎస్‌లో గ్రూప్‌ తగాదాలు మొదలయ్యాయా? కొత్త.. పాత మధ్య లొల్లిని చక్కదిద్దుతోంది ఎవరు? నియోజకవర్గ అభివృద్ధితోపాటు రాజకీయ సయోధ్యకు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR ప్రాతినిథ్యం వహిస్తోన్న సిరిసిల్లలో ఏం జరుగుతోంది? 

సిరిసిల్ల టీఆర్‌ఎస్‌ సమస్యలపై కేటీఆర్‌ ఫోకస్‌!

తెలంగాణలో అధికారపార్టీ TRSలో గ్రూప్‌ తగాదాలు ఎక్కడో ఒక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ తగాదాలు పార్టీకి ఇబ్బందిగా కూడా మారుతున్నాయి. ముఖ్యంగా కొత్త, పాత నాయకులు, కార్యకర్తల మధ్య ఎక్కువగా సమస్యలు ఉంటున్నాయని సమాచారం. ఇలాంటి గొడవే తాజాగా  TRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR నియోజకవర్గం సిరిసిల్లలోనూ మొదలైందట. దీనిపై పార్టీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోందట. అయితే తన సొంత నియోజకవర్గంలో ఈ సమస్య ముదురు పాకాన పడకుండా KTR అప్రమత్తం అయ్యారట.

మండలాల వారీగా భేటీకి ప్లాన్‌!

సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగలపల్లి మండల నేతలతో KTR ఇటీవలే భేటీ అయినట్టు తెలుస్తోంది. కొత్త, పాత నేతలు పాల్గొన్న ఆ సమావేశంలో నాయకుల అభిప్రాయాలను ఓపిగ్గా విన్నారట KTR. సిరిసిల్లలో తోట ఆగయ్య, కొండూరు రవీందర్‌రావు మధ్య పంచాయితీ మొదలైందట. టీఆర్‌ఎస్‌లో మొదటి నుంచి ఉన్నవారిని కాకుండా కాంగ్రెస్‌ నుంచి వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారట. గంభీర్‌రావుపేట, ముస్తబాద్‌, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల టౌన్‌లలో టీఆర్‌ఎస్‌ నేతలతో సమావేశం అయ్యేందుకు టైం టేబుల్‌ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.  

భేటీలకు రాజకీయ ప్రాధాన్యం లేదంటోన్న పార్టీ వర్గాలు!

ఆయా మండలాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపైనా కేటీఆర్‌ నిర్వహిస్తోన్న సమావేశాల్లో చర్చిస్తున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా పార్టీ పటిష్టత.. సమస్యల పరిష్కారంపైనా ఫోకస్‌ పెట్టారట. అయితే.. సమావేశానికి హాజరైన పార్టీ నాయకులు పైపైనే మాట్లాడుతున్నారట. KTR ముందు మనసు విప్పి అసలు విషయం చెప్పలేకపోతున్నారట. ప్రధానంగా కొండూరు రవీందర్‌రావుపైనే పార్టీలోని ఓ వర్గం అసంతృప్తితో ఉందట. మధ్యలో పార్టీలోకి వచ్చిన ఆయన లేని పెత్తనం చేస్తున్నారని టీఆర్‌ఎస్‌లో మొదటి నుంచి ఉన్న పాతతరం రుసరుసలాడుతున్నట్టు తెలుస్తోంది. అయితే సిరిసిల్ల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ నేతలతో కేటీఆర్‌ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదన్నది అధికార పార్టీ నాయకులు చెప్పేమాట. ఈ సమావేశాలన్నీ అభివృద్ధి కార్యక్రమాల అమలులో భాగమేనని పైకి చెబుతున్నారు. 

కేటీఆర్‌ డీల్‌ చేస్తోన్న విధానంపై పార్టీలో చర్చ!

సిరిసిల్ల టీఆర్‌ఎస్‌ విషయంలో పార్టీలోని వారి వాదన ఎలా ఉన్నా.. ఈ సమస్యను KTR డీల్‌ చేస్తున్న విధానంపై పార్టీ నేతలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారట. ఇక్కడ ఈ ఫార్ములా సక్సెస్‌ అయితే.. రాష్ట్రంలో మిగతా చోట్ల ఉన్న పాత-కొత్త మధ్య రగడను కొలిక్కి తేవచ్చొని భావిస్తున్నారు. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.