#SaveNallamalaకు పెరుగుతోన్న మద్దతు

#SaveNallamalaకు పెరుగుతోన్న మద్దతు

సేవ్ నల్లమలకు క్రమంగా మద్దతు పెరుగుతోంది... స్థానిక గిరిజనులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు.. సెలబ్రిటీలు ఇలా ముందుకు సాగుతోంది... సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ ప్రముఖులు, శాస్త్రవేత్తలు, వైద్యులు, ఇతర రంగాలవారు స్పందిస్తుండడంతో #SaveNallamala యాష్ ట్యాగ్‌ ట్రెండ్ అవుతోంది. నల్లమలలో యురేనియం తవ్వకలపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తమ బతుకులు నాశనమవుతాయని ఆవేదన  వ్యక్తం చేస్తున్న గిరిజనులు... నల్లమల రక్షించేందుకు పోరుబాట పట్టారు. విపక్షాలు సైతం పోరాటలకు సిద్ధమౌతున్నాయి. మరోవైపు... సోషల్‌ మీడియాలో ప్రారంభమైన సేవ్‌ నల్లమల ఉద్యమానికి సెలబ్రిటీల నుంచి సైతం మద్దతు లభిస్తోంది. యురేనియం తవ్వకల వల్ల అడవి హరించుకుపోతుందని తెలిసి కూడా ప్రభుత్వం ఎలా అనుమతిచ్చిందని ప్రశ్నిస్తున్నారు పలువురు సెలబ్రిటీలు. పచ్చదనం పెంచుతామంటున్న ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సేవ్ నల్లమల ఉద్యమంలో ముందుగా స్పందించారు దర్శకుడు శేఖర్ కమ్ముల... భావి తరాల భవిష్యత్ కోసం నల్లమలను రక్షించాలని ట్విట్టర్‌లో కోరారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్, హీరోలు విజయ్ దేవరకొండ, సాయిధరమ్ తేజ్‌తో పాటు యాంకర్ అనసూయ సహా పలువురు సెలబ్రిటీలు సేవ్ నల్లమల ఉద్యమానికి సోషల్ మీడియాలో మద్దతిస్తున్నారు. యురేనియం తవ్వకాల వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బంతింటుందని సెలబ్రిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న కృష్ణా నది, దాని ఉపనదుల్లో ఉండే సహజపోషకాలు దెబ్బతింటాయని... భవిష్యత్‌లో అది తీవ్ర ప్రభావం చూపుతుందనే కామెంట్స్‌ పోస్టు చేస్తున్నారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా వారం క్రితం నల్లమల ప్రాంతంలో ప్రతిపక్షాలు పిలుపునిచ్చిన బంద్‌కు స్థానికుల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. దీంతో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీనియర్‌ నేత వీహెచ్‌ ఆధ్వర్యంలో పోరాట కమిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ. పవన్‌ కల్యాణ్‌ కూడా దీనిపై పోరాటానికి సమాయత్తమవుతున్నారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ అందరూ నల్లమలను రక్షించుకుందామంటున్నారు. ఇప్పటికే సోషల్‌ మీడియాలో ఉధృతమవుతున్న సేవ్‌ నల్లమల ఉద్యమం... త్వరలో ప్రత్యక్ష పోరాటాలకు దారి తీయడం ఖాయం. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.