వచ్చే ఆర్థిక సంవత్సరం ఆర్థిక వృద్ధిరేటు 7.5%

వచ్చే ఆర్థిక సంవత్సరం ఆర్థిక వృద్ధిరేటు 7.5%

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.2% ఉన్న ఆర్థిక వృద్ధిరేటు 2019-20 ఆర్థిక సంవత్సరంలో 7.5%కి చేరవచ్చని ప్రధాన ఆర్థిక సలహాదారు కెవి సుబ్రహ్మణియన్ చెప్పారు. గత వారం విడుదల చేసిన తాజా ద్రవ్య విధాన సమీక్షలో ఆర్బీఐ కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధిరేటు 7.4% ఉండవచ్చని అంచనా వేసింది. 

గత నాలుగేళ్ల సగటు వృద్ధిరేటు గురించి మాట్లాడుతూ జీడీపీ వృద్ధి రేటు 7.3% ఉందని, సరళీకరణ తర్వాత అన్ని ప్రభుత్వ హయాంలలో ఇదే గరిష్ఠమని సుబ్రమణియన్ అన్నారు. అతి తక్కువ ద్రవ్యోల్బణం మధ్య ఈ వృద్ధి రేటు సాధించినట్టు ఆయన చెప్పారు.

2014కు ముందు సగటు ద్రవ్యోల్బణం 10% కంటే ఎక్కువగా ఉండేదన్నారు. ద్రవ్యోల్బణాన్ని ఆర్బీఐ ఒక నిర్దిష్ట బ్యాండ్ లో ఉంచడం తప్పనిసరి చేసిన ద్రవ్య విధాన నిర్మాణం కారణంగానే ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గిందని చెప్పారు. 

వృద్ధి రేటుకి మద్దతిస్తూ వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణాన్ని 4% (+/-2)గా ఉంచాలని ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీకి మధ్యస్థ కాల లక్ష్యాలను సాధించాలని నిర్దేశించినట్టు సుబ్రమణియన్ తెలిపారు.