ఏప్రిల్ లో రికార్డు స్థాయిలో రూ.1.13 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు

ఏప్రిల్ లో రికార్డు స్థాయిలో రూ.1.13 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు

ఏప్రిల్ నెలలో జీఎస్టీ కలెక్షన్ రూ.1.13 లక్షల కోట్ల రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. గత నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.06 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఏప్రిల్ 2019లో జీఎస్టీ రెవెన్యూ రూ.1,13,865 కోట్లు అని ఒక అధికారిక ప్రకటనలో తెలియజేశారు. ఇందులో కేంద్ర జీఎస్టీ(సీజీఎస్టీ) వసూళ్లు రూ.21,163 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ (ఎస్జీఎస్టీ) రూ.28,801 కోట్లు, ఏకీకృత జీఎస్టీ(ఐజీఎస్టీ) రూ.54,733 కోట్లు, సెస్ రూ.9,168 కోట్లని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది.

మార్చి నెలకు ఏప్రిల్ 30 వరకు మొత్తం 72.13 లక్షల జీఎస్టీఆర్ 3బీ రిటర్న్ లు దాఖలైనట్టు బుధవారం జారీ చేసిన ప్రకటనలో పేర్కొంది. దేశంలో జీఎస్టీ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత గత నెల మార్చిలో జీఎస్టీ వసూళ్లు అత్యధికంగా ఉన్నాయి. ఏప్రిల్ 2018తో పోలిస్తే ఏప్రిల్ 2019లో జీఎస్టీ కలెక్షన్ 10.05 శాతం పెరిగింది. గత ఏడాది ఏప్రిల్ లో జీఎస్టీ వసూలు రూ.1,03,459 కోట్లుగా ఉంది. రెగ్యులర్ సెటిల్ మెంట్ లో భాగంగా కేంద్రం ఐజీఎస్టీ నుంచి రూ.20,370 కోట్లను సీజీఎస్టీకి, రూ.15,975 కోట్లను ఎస్జీఎస్టీకి సెటిల్ చేసింది. కేంద్రం దగ్గర మిగిలిన రూ.12,000 కోట్ల ఐజీఎస్టీని 50:50 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య సెటిల్ చేయడం జరిగింది.