చక్కెరపై సెస్ వాయిదా

చక్కెరపై సెస్ వాయిదా

జీఎస్‌టీలో  కీలకమైన జీఎస్‌టీఎన్‌ను ఇకపై ప్రభుత్వ ఆధీన సంస్థగా మార్చేందుకు జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం ఆమోదం తెలిపింది. 27వ సారి సమావేశమైన జీఎస్‌టీ కౌన్సిల్‌... ముందుగా షుగర్‌పై పన్ను విధించేలా నిర్ణయం తీసుకుంటారని వార్తలు వచ్చినా... ఈ నిర్ణయాన్ని వాయిదా వేసింది. పలు రాష్ట్రాలు చక్కెరపై సెస్‌ను వ్యతిరేకిస్తుండగా... కొన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. దీంతో షుగర్‌పై సెస్ వేసే నిర్ణయాన్ని వాయిదా వేశారు. దాదాపు ఐదు రాష్ట్రాలు సుగర్‌పై  లెవీకి అనుకూలంగా లేవని బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా వెల్లడించగా... ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు చక్కెరపై లెవీని వ్యతిరేకించారు... ఈ నిర్ణయం తీసుకుంటే సామాన్యుడిపై మరింత భారాన్ని మోపడమే అవుతుందన్నారాయన. 

మరోవైపు షుగర్‌పై సెస్‌ వేయడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీకి లేఖరాశారు ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు... పంచదారపై కేజీకి రూ.3 సెస్‌ వేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని లేఖలో పేర్కొన్న ఆయన... కేజీకి రూ.3 సెస్‌ వేయడం వల్ల సామాన్యుడిపై భారం పడుతుందని తెలిపారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చక్కెరపై రూ.250 కోట్ల భారం మోస్తుందని పేర్కొన్నారు యనమల. అయితే చెరకు రైతుల బకాయిలతో పాటు చక్కెర మిల్లుల కోసం ఈ సెస్‌ ప్రతిపాదించారు. ఆహార శాఖ ఈ సెస్‌ను ప్రతిపాదించింది. అయితే రకరకాల పన్నులు, సెస్సుల బదులుగా జీఎస్టీని తెచ్చారని, మళ్ళీ కొత్తగా సెస్‌ విధించడమేమిటని చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా చెరకు పండించని రాష్ట్రాలతో పాటు కర్ణాటక వంటి రాష్ట్రాలు కూడా ఈ సెస్‌ను వ్యతిరేకిస్తున్నాయి. పైగా ఇపుడున్న జీఎస్టీ చట్టం ప్రకారం పరిహార సెస్‌ మినహా, ఇతర సెస్‌లు విధించే  అవకాశం లేదు. దీంతో ఆర్డినెన్స్‌ ద్వారా ఈ సెస్‌ వేయాల్సి ఉంటుంది. ఈ చిక్కుల కారణంగా ఇవాళ్టి సమావేశంలో దీనిపై నిర్ణయాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది.