ఇక ఆధార్ తో జీఎస్టీ రిజిస్ట్రేషన్

ఇక ఆధార్ తో జీఎస్టీ రిజిస్ట్రేషన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శుక్రవారం జీఎస్టీ కౌన్సిల్ మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ సులభతరం చేసేందుకు ఆధార్ తో జీఎస్టీ రిజిస్ట్రేషన్ కు నిర్ణయించారు. జీఎస్టీ యాంటీ-ప్రాఫిటీరింగ్ అథారిటీ పదవీకాలం రెండేళ్లకు పెంచారు. 

జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే వివరించారు. ఆన్ లైన్ లో అప్లై చేసే వ్యక్తులు తమ ఆధార్ నెంబర్ ఉపయోగించి ఓటీపీ పొంది జీఎస్టీఎన్ పోర్టల్ లో స్వయంగా రిజిస్టర్ చేసుకోవచ్చని.. జీఎస్టీఎన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ను పొందవచ్చని చెప్పారు. ఇప్పుడు రెండు నెలల వరకు జీఎస్టీ రిటర్న్ లు దాఖలు చేయకపోతే ఈ-వే బిల్లు జనరేట్ కాకుండా నిషేధం విధిస్తారు. ఈ ఆదేశాలు 21 జూన్ కి బదులు 21 ఆగస్ట్ నుంచి అమలవుతాయి. ఈ-వే బిల్ సిస్టమ్ సామాగ్రిని రవాణా చేసేటపుడు రవాణా వ్యవస్థతో అనుసంధానమై ఉంటుంది. తప్పు చేసిన సంస్థపై ప్రాఫిటీరింగ్ మొత్తంపై 10 శాతం జరిమానా విధిస్తారు.

గత కొన్ని నెలల్లో తీసుకున్న అనేక మార్పులకు జీఎస్టీ కౌన్సిల్ అమోదముద్ర వేసిందని పాండే తెలిపారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ పరిమితిని రూ.20 లక్షల నుంచి పెంచి రూ.40 లక్షలు చేశారు. గతంలో ఇది నోటిఫికేషన్ ద్వారా జరిగింది. ఇప్పుడు చట్టాల్లో తగిన మార్పులు చేయడం జరిగింది. రూ.5 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న డీలర్లు త్రైమాసిక ఆధారంగా రిటర్న్ లు దాఖలు చేయాలని రెవెన్యూ కార్యదర్శి తెలిపారు. రూ.5 కోట్లకు మించి టర్నోవర్ ఉన్నవారు నెలనెలా రిటర్న్ దాఖలు చేయాలి. ఇంతకు ముందున్న వ్యవస్థలో అనేక పత్రాలు సమర్పించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆధార్ ఉపయోగించాలని నిర్ణయించినట్టు ఆయన ప్రకటించారు. ఆధార్ ఉపయోగం వల్ల పరిశ్రమలకు అనేక లాభాలు ఉంటాయని చెప్పారు.

ఈ-ఇన్వాయిస్ కి జీఎస్టీ కౌన్సిల్ సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది. మల్టీ-స్క్రీన్ సినిమా హాళ్లకు ఎలక్ట్రానిక్ టికెట్లు జారీ చేయడం తప్పనిసరి చేశారు. జీఎస్టీ కౌన్సిల్ వార్షిక రిటర్న్ లు ఫైల్ చేసేందుకు కాల పరిమితిని రెండు నెలలు పొడిగించి ఆగస్ట్ 30, 2019కి మార్చింది. కొత్త జీఎస్టీ రిటర్న్ ఫైలింగ్ సిస్టమ్ జనవరి 1, 2020 నుంచి అమల్లోకి వస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ రేటును 12 నుంచి తగ్గించి 5 శాతం, ఎలక్ట్రిక్ ఛార్జర్లపై 18 నుంచి తగ్గించి 12 శాతం చేయాలన్న ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ ఫిట్ మెంట్ కమిటీకి పంపింది. యాంటీ-ప్రాఫిటీరింగ్ అథారిటీ పదవీ కాలం రెండేళ్లు పెంచి నవంబర్ 30, 2021 చేశారు.