5 శాతం చక్కెర సెస్‌?

 5 శాతం చక్కెర సెస్‌?

జనంపై మరో అయిదు శాతం చక్కెర సెస్‌ విధించే అంశాన్ని జీఎస్‌టీ కౌన్సిల్‌ చర్చిస్తోంది. కౌన్సిల్‌ 27వ సమావేశం ఇవాళ జరుగుతోంది. ఈ సమావేశంలో చక్కెర సెస్‌ గురించి చర్చించనున్నారు. చెరకు రైతుల బకాయిలతో పాటు చక్కెర మిల్లుల కోసం ఈ సెస్‌ ప్రతిపాదించారు. ఆహార శాఖ ఈ సెస్‌ను ప్రతిపాదించింది. అయితే రకరకాల పన్నులు, సెస్సుల బదులుగా జీఎస్టీని తెచ్చారని, మళ్ళీ కొత్తగా సెస్‌ విధించడమేమిటని చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా చెరకు పండించని రాష్ట్రాలతో పాటు కర్ణాటక వంటి రాష్ట్రాలు కూడా ఈ సెస్‌ను వ్యతిరేకిస్తున్నాయి. ఇవాళ్టి కౌన్సిల్‌ సమావేశానికి పలు రాష్ట్రాల  ఆర్థిక మంత్రులు డుమ్మా కొడుతున్నారు.  ఈ నేపథ్యంలో చక్కెర సెస్‌కు ఆమోదం లభిస్తుందా అన్నది చూడాలి. 

పైగా ఇపుడున్న జీఎస్టీ చట్టం ప్రకారం పరిహార సెస్‌ మినహా, ఇతర సెస్‌లు విధించే  అవకాశం లేదు. దీంతో ఆర్డినెన్స్‌ ద్వారా ఈ సెస్‌ వేయాల్సి ఉంటుంది. ఈ చిక్కుల కారణంగా ఇవాళ్టి సమావేశం దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు తక్కువే. ఇక జీఎస్టీఎన్‌ను ప్రభుత్వ పరిధిలోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇన్ఫోసిస్‌తోపాటు పలు కంపెనీలు జీఎస్టీఎన్‌ను ఇపుడు నిర్వహిస్తున్నాయి. సగం వాటా కేంద్రానికి, మిగిలిన సగం రాష్ట్రాలకు ఉండేలా ఈ సంస్థను ప్రభుత్వ యజమాయిషీలోకి తేనున్నారు. అలాగే జీఎస్టీ రిటర్న్‌లను మరింత సరళీకరించే అంశాన్ని కూడా ఇవాళ్టి సమావేశం పరిశీలించనుంది.