చిట్టీలు పెట్టి దొరికిపోయిన బీజేపీ నేత కొడుకు

చిట్టీలు పెట్టి దొరికిపోయిన బీజేపీ నేత కొడుకు

లోక్ సభ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో బీజేపీ ఇబ్బందికర స్థితిలో పడింది. గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు జీతూ వాఘానీ కొడుకు మీత్ వాఘానీ గురువారం యూనివర్సిటీ పరీక్షల్లో చీటింగ్ చేస్తూ దొరికిపోయాడు.

భావ్ నగర్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న స్వామీ వివేకానంద్ కాలేజ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ లో బీసీఏ చదువుతున్న మీత్ వాఘానీ, రెండో సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యాడు. ఎం జె కాలేజ్ ఆఫ్ కామర్స్ లో పరీక్షలు రాస్తున్న మీత్, 27 చిట్టీలతో దొరికినట్టు ప్రిన్సిపాల్ కంజీభాయ్ వటాలియా చెప్పారు.

మీత్ పై భావ్ నగర్ యూనివర్సిటీకి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు అందజేశారు. తన కుమారుడు దోషిగా తేలితే నియమాల ప్రకారం అతనిని శిక్షించాల్సిందేనని వాఘానీ అన్నారు. ఈ ప్రక్రియలో తను జోక్యం చేసుకోబోనని స్పష్టం చేశారు. దేశంలో లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగిన ఈ సంఘటన సీనియర్ వాఘానీకి తలనొప్పిగా మారే అవకాశాలున్నాయి. వాఘానీ భావ్ నగర్ పశ్చిమ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వరుసగా రెండు సార్లు గెలిచారు.

రాజకీయ నాయకుల సంతానం పరీక్షల్లో కాపీ కొడుతూ పట్టుబడటం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శకుంతల ఖాతిక్ కుమారుడు బీఏ పరీక్షల్లో చీటింగ్ చేస్తూ దొరికిపోయాడు. నితిన్ ఖాతిక్ చీటింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.