కొత్త చట్టాన్ని పట్టించుకోని గుజరాత్‌! ట్రాఫిక్ జరిమానాలు తగ్గింపు!

కొత్త చట్టాన్ని పట్టించుకోని గుజరాత్‌! ట్రాఫిక్ జరిమానాలు తగ్గింపు!

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మోటార్ వెహికల్ చట్టం ప్రకారం.. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినవారికి భారీగా జరిమానాలు విధిస్తున్నారు.. ఇది కొన్ని రాష్ట్రాలు మినహాయిస్తే.. అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. వాహనాల విలువకు మించి కూడా జరిమానాలు పడుతున్న ఘటనలు చూస్తున్నాం. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రం.. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న గుజరాత్‌లో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. కేంద్ర చట్టం ప్రకారం కాకుండా.. వాటిని తగ్గించి జరిమానాలు విధించాలని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విష‌యాన్ని ఆ రాష్ట్ర సీఎం విజ‌య్ రూపానీ తెలిపారు. హెల్మెట్ లేకుండా వాహ‌నం నడిపితే గతంలో రూ.100 ఫైన్ ఉండగా.. కొత్త చట్ట ప్రకారం రూ.1000 విధించాలని.. కానీ, గుజరాత్ రూ.500కు తగ్గించింది. ఇక, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పత్రాలు కూడా ఒరిజినల్స్ వెంట పెట్టుకొని తిరగాల్సిన పనిలేదు.. డిజీలాక‌ర్ యాప్‌లో ఉన్న డ్రైవింగ్ లైసెన్సు, ఇత‌ర డాక్యుమెంట్ల‌ను ట్రాఫిక్ అధికారుల‌కు చూపించ‌వ‌చ్చు అని గుజరాత్ సీఎం వెల్లడించారు. ఇక వాటితో పాటు అన్ని రకాల జరిమానాలు తగ్గించింది గుజాత్.. ఈ నెల 16వ తేదీ నుంచి అమలు చేయనుంది.