92వ ఆస్కార్ బరిలో నిలిచిన గల్లీబాయ్

92వ ఆస్కార్ బరిలో నిలిచిన గల్లీబాయ్


మరో...ఇండియన్ సినిమా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ గల్లీబాయ్‌ సినిమా ఇండియా తరపున 92వ ఆస్కార్‌ అవార్డుల బరిలోకి దిగింది. గల్లీబాయ్ ఉత్తమ ఫారెన్ లాంగ్వేజ్ మూవీ విభాగంలో పోటీపడనుంది. ఈ విషయాన్ని ఈ సినిమాని నిర్మించిన నిర్మాత ఫర్హాన్‌ అక్తర్‌ ట్విటర్‌ వేదికగా తెలిపారు. "గల్లీబాయ్‌ 92వ ఆస్కార్‌ అవార్డుల బరిలో పోటీపడేందుకు ఎంపికైంది. మన టైం వచ్చేసింది. ఫిల్మ్‌  ఫెడరేషన్‌కు ధన్యవాదాలు. జోయా అక్తర్‌, రణ్‌వీర్‌ సింగ్‌, అలియా భట్‌ తదితర చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు" అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

ఆస్కార్‌ కోసం జ్యూరీ వివిధ భాషలకు  చెందిన 28 సినిమాలను ఎంపిక చేసింది. వీటిలో తెలుగు నుంచి డియర్‌ కామ్రేడ్ కూడా ఉంది. అన్నీ చిత్రాల్ని చూసిన జ్యూరీ సభ్యులు చివరికి గల్లీబాయ్‌ను ఎంపిక చేశారు. ఈ మూవీకి జోయా అక్తర్‌ దర్శకత్వం వహించారు. మురికివాడలో జన్మించిన రణ్‌వీర్‌ సంగీత ప్రపంచంలో తనదైన ముద్రవేయాలని కలలు కని ఎంతో కష్టపడి ర్యాప్‌ సింగర్‌గా గుర్తింపు  తెచ్చుకుంటాడు. ఈ ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటాడు. ఈ కథాంశంతో రూపొందిన సినిమా ఫిబ్రవరి 14న విడుదలైన మంచి విజయం అందుకుంది. దాదాపు 40 కోట్ల బడ్జెట్‌తో  రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సుమారు రెండువందల ముప్పై కోట్లు రాబట్టినట్లు విశ్లేషకులు అంచనా వేశారు.