ఈ బండిపై వేసిన ఫైన్‌తో కొత్త బైక్ కొనేయొచ్చు..!

ఈ బండిపై వేసిన ఫైన్‌తో కొత్త బైక్ కొనేయొచ్చు..!

ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త మోటార్ వాహన చట్టం రూల్స్ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రతీ ఒక్కరూ రూల్స్ పాటించేలా చేయడానికే ఈ భారీ జరిమానాలను విధించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నా... దొరికినవారి జేబుకు చిల్లు పడిపోతోంది. గుర్గావ్‌లో టు విలర్‌పై వెళ్తున్న దినేష్ మాదన్‌ అనే వ్యక్తిని పోలీసులు ఆపారు.. సమయానికి దినేష్ దగ్గర ఏమీ లేకపోవడంతో... కొత్త నిబంధనల ప్రకారం జరిమానా విధించారు. ట్రాఫిక్ పోలీసులు రాసిన చలాన్లు చూసి షాక్‌ తిన్నాడు దినేష్.. ఎందుకంటే.. ఏకంగా రూ.23,000 జరిమానా పడింది. లైసెన్స్, ఆర్సీ, హెల్మెట్.. ఇలా లెక్కలు తీసి చుక్కలు చూపించారు. 

ట్రాఫిక్ పోలీసుల తీరుపై ఆవేదన వ్యక్తం చేశాడు దినేష్.. వాట్సాప్‌లో లెసెన్స్‌ కాపీని చూపించినా ఒప్పుకోలేదని వాపోయాడు. ఇక అసలు విషయం ఏంటంటే...! దినేష్.. హోండా యాక్టివా బైక్‌ను సెకండ్ హ్యాండ్‌లో కొనుగోలు చేశాడు.. రూ.15వేలతో ఆ బైక్‌ను కొన్నాడు. దీనిపై పోలీసులు విధించిన జరిమానా మాత్రం రూ. 23 వేలు కావడంతో షాక్ తిన్నాడు. తన బండికి సంబంధించిన పేపర్లన్నీ ఇంటి దగ్గర ఉన్నాయని.. అయితే హెల్మెట్‌ పెట్టుకోనందుకు రూ.వెయ్యి ఫైన్‌తో సరిపెట్టాలని మొరపెట్టుకున్నా పోలీసులు కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు మాత్రం.. అందరికీ ఒకే రూల్.. లైసెన్స్, ఆర్సీ, ఇన్సురెన్స్, ఎయిర్ పొల్యూషన్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడంతో ఈ జరిమానా వేసినట్టు స్పష్టం చేశారు. మొత్తానికి రూ.15 వేల విలువైన బండిపై రూ.23  వేల జరిమానా విధించగా.. ఆ రూ.23 వేలతో సెకండ్ హ్యాండ్‌లో బైక్ కొంటే మరికొంత డబ్బు కూడా మిగిలించుకోవచ్చు. ఇక షోరూమ్‌కు వెళ్లి.. డౌన్‌పేమెంట్ కడితే కొత్త బైకే వచ్చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.