మండలి ఛైర్మన్‌గా గుత్తా బాధ్యతల స్వీకరణ

మండలి ఛైర్మన్‌గా గుత్తా బాధ్యతల స్వీకరణ

తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన సీనియర్ రాజకీయ నేత గుత్తా సుఖేందర్‌ రెడ్డి... ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్ పదవికి ఒకే నామినేషన్ దాఖలు అయ్యింది. దీంతో.. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని మండలి సమావేశాలు ప్రారంభమైన వెంటనే డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ ప్రకటించారు. అనంతరం గుత్తా సుఖేందర్‌ రెడ్డిని చైర్మన్‌ చైర్‌ వద్దకు తీసుకెళ్లారు అధికార, విపక్ష నేతలు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీష్‌రావుతో పాటు పలువురు మంత్రులు, విపక్ష సభ్యులు పాల్గొన్నారు. 

ఇక, నల్గొండ రాజకీయాలపై తనకంటూ ప్రత్యేక ముద్రవేశారు గుత్తా సుఖేందర్ రెడ్డి.. వామపక్ష పార్టీలు, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. మూడుసార్లు ఎంపీగా పనిచేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి..  ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయనకున్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొన్న సీఎం కేసీఆర్.. గుత్తాను మండలి చైర్మన్‌గా ఎంపికచేశారు. ఎమ్మెల్యే కోటాలో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే.. మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం సాగినా.. తాజాగా జరిగిన కేబినెట్ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. కొన్ని సమీరణల దృష్ట్యా ఆయనకు మంత్రి పదవి రాకపోయినా.. మండలి చైర్మన్‌ ఇచ్చి గౌరించారు సీఎం కేసీఆర్.