కాళేశ్వరం ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టు

కాళేశ్వరం ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టు

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే మహా అద్భుతమైనదని టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా దేవరకొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. కోటి ఇరవై ఐదు లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణానికి భూములు ఇచ్చి సహకరించిన రైతులకు, పగలు రాత్రి తేడా లేకుండా సాంకేతికంగా కష్టపడిన ఇంజనీర్లు, కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ పండుగలో జిల్లా, మండల, గ్రామ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లు అగ్రభాగాన ఉండాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు 90 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. నల్లగొండ జిల్లాలో ఎవరు పార్టీ మారిన టీఆర్ఎస్ పై ప్రభావం ఉండదని పరోక్షంగా కోమటిరెడ్డి రాజగోపాల్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.