ఏపీ ఎన్నికల ఫలితాలపై జీవీఎల్‌ కామెంట్స్‌ 

ఏపీ ఎన్నికల ఫలితాలపై జీవీఎల్‌ కామెంట్స్‌ 

ఏపీలో అధికార పార్టీ ఓడిపోబోతోందని, ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ కనుమరుగవుతుందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అభిప్రాయపడ్డారు. చంద్రబాబునాయుడుపై ప్రజలు విశ్వనీయత కోల్పోయారని, అధికార పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉన్నదని అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు అధిక సంఖ్యలో ఓడిపోబోతున్నారని అన్నారు. అసెంబ్లీకి సంబంధించి ప్రాంతీయ పార్టీకి ఓటు వేసినా పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి బీజేపీకి క్రాస్‌ ఓటింగ్‌ చేశారని అన్నారు.  

'రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు బాగుంటుంది. ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడబోతోంది. ఆ శూన్యతను బీజేపీ భర్తీ చేయనుంది. గత ఎన్నికలకంటే అధిక స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుంది' అని జీవీఎల్‌ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌, జగన్‌ విధానాలను చంద్రబాబు కాపీ కొట్టారన్న జీవీఎల్‌.. చంద్రబాబు ఒక స్టాండ్ లేని నాయకుడుగా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. 
రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలు బీహార్‌ను తలపించాయన్న జీవీఎల్‌.. ఎలక్షన్‌ కమిషన్ మరికొంతమంది సిబ్బందిని నియమించుంటే ఎన్నికలు  సజావుగా సాగేవని అభిప్రాయపడ్డారు. ధన రాజకీయాలు రాష్ట్రంలో శ్రుతి మించాయని.. వేలంపాట రాజకియాలతో పార్టీలు పోటీ పడ్డాయని విమర్శించారు.