రూ.280 కోట్ల విలువైన బిట్ కాయిన్స్ దోచేసిన హ్యాకర్లు

రూ.280 కోట్ల విలువైన బిట్ కాయిన్స్ దోచేసిన హ్యాకర్లు

ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్స్ ఛేంజీల్లో ఒకటైన బినాన్స్ ఎక్స్ ఛేంజీ నుంచి హ్యాకర్లు సుమారు రూ.280 కోట్లు (40 మిలియన్ డాలర్లు) విలువైన 7,000 బిట్ కాయిన్లు దోచుకున్నారు. ఈ సంగతిని కంపెనీ బుధవారం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ ఎక్స్ ఛేంజీలలో జరుగుతున్న వరుస దొంగతనాల్లో ఇది తాజాగా జరిగింది. 

ఈ 7,000 బిట్ కాయిన్లను విత్ డ్రా చేసేందుకు హ్యాకర్లు 'ఫిషింగ్, వైరస్ లు, ఇతర దాడుల' వంటి పలు విధాలైన టెక్నిక్ లు వాడినట్టు బినాన్స్ వెబ్ సైట్ లో పెట్టిన పోస్టులో కంపెనీ సీఈవో ఝావ్ చాంగ్ పెంగ్ తెలిపారు. వీటితో యూజర్ల నిధులు ఏ విధంగానూ ప్రభావితం కాబోవని, యూజర్లకు వాటిల్లే నష్టాల్ని భర్తీ చేసేందుకు కంపెనీ తన సెక్యూర్ అసెట్ ఫండ్ వినియోగిస్తుందని చెప్పారు.

ఆసియా ట్రేడింగ్ ప్రారంభంలో ఈ హ్యాక్ వార్తలు వెలువడగానే బిట్ కాయిన్ ధరలు 4.2 శాతం వరకు పతనమయ్యాయి. ఆ తర్వాత ఆ నష్టాల నుంచి కొంత మేరకు రికవర్ అయింది. కాయిన్ బేస్ సహా ఇతర క్రిప్టో ఎక్స్ ఛేంజీలు ఈ హ్యాక్ తో సంబంధం ఉన్న అడ్రస్ ల నుంచి డిపాజిట్లను బ్లాక్ చేసినట్టు ఝావో తన ట్విట్టర్ హ్యాండిల్ లో తెలిపారు.