రోడ్డు ప్రమాదంలో కేరళ 'చేపల అమ్మాయి'కు గాయాలు

రోడ్డు ప్రమాదంలో కేరళ 'చేపల అమ్మాయి'కు గాయాలు

కాలేజీ యూనిఫామ్‌లో చేపలు అమ్మినందుకు  ట్రోలైన కేరళ విద్యార్థిని హనన్ హమీద్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈరోజు ఉదయం కోడంగళూరులోని వడాకర సమీపంలో ఓ షాప్ ఓపెనింగ్ కు వెళ్లివస్తుంగా ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఎదురుగా ఎదురొచ్చిన వ్యక్తిని తప్పించే క్రమంలో డ్రైవర్ ఒక్కసారిగా స్టీరింగ్ తిప్పడంతో కారు ఓ చెట్టుకు ఢీకొంది. ప్రమాదంలో హనన్ వెన్నెముకకు తీవ్ర గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం ఎర్నాకులంలోని ఆస్పత్రికి తరలించారు.
 
చదువుకొనేందుకు చేపలు అమ్ముకొనే విద్యార్థిని హనన్ హమీద్ కథనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమె చెప్పేదంతా అబద్ధం అంటూ సోషల్ మీడియాలో, బయట విమర్శల జడివాన వచ్చింది. దీంతో కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఆమెను ప్రభుత్వ పుత్రికగా ప్రకటించారు. ఆమె చదువుకయ్యే ఖర్చునంతా సర్కారే భరిస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఇడుక్కిలోని ఓ ప్రైవేటు కాలేజీలో హనన్ డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోంది.