నవ్వుల 'పూల' రంగడు ...సునీల్ 

నవ్వుల 'పూల' రంగడు ...సునీల్ 

మధ్యలో కథానాయకునిగా కసరత్తులు చేసి మెప్పించాడు కానీ, అంతకు ముందు సునీల్ తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల పెదాలపై నవ్వులు నాట్యం చేసేవి. హీరోగానూ కొన్ని చిత్రాలలో బాగానే ఆకట్టుకున్నాడు సునీల్. ముద్దుగా బొద్దుగా ఉన్నప్పుడే సునీల్ బాగుండేవాడని కొందరి మాట! లేదు నాజూగ్గా మారిన తరువాతే సునీల్ భలేగా ఉన్నడన్నది మరికొందరి అభిప్రాయం. ఏది ఏమైనా హాస్యనటులు హీరోలుగా అలరించిన వారి జాబితాలో సునీల్ చేరిపోయాడు. 

నవ్వుల్లో వైవిధ్యం...
ఒకప్పుడు హాస్యనటుడు పద్మనాభం పలు చిత్రాల్లో నవ్వుల్లో వైవిధ్యం చూపిస్తూ నటించారు. అదే పంథాలోనే సునీల్ కూడా సాగారనిపిస్తుంది. ఆరంభంలో మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన చేసిన చిత్రాల్లో కాసింత గుర్తింపు ఉన్న పాత్రల్లో నటించాడు. ఆ తరువాత తనదైన మార్కు ప్రదర్శించాడు. ఆ పై సొంత బాణీ పలికిస్తు, పలు చిత్రాలలో పకపకలు పంచాడు. టాప్ స్టార్స్ అందరితోనూ నటించి అలరించిన సునీల్ కు తేజ తెరకెక్కించిన 'నువ్వు-నేను' ఉత్తమ హాస్యనటునిగా నంది అవార్డు సంపాదించి పెట్టింది. ఆ తరువాత 'ఆంధ్రుడు'లోనూ సునీల్ హాస్యాభినయానికి మరో నంది అవార్డు దక్కింది. 'అందాలరాముడు'లో కథానాయకునిగా అలరించిన సునీల్ కు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'మర్యాద రామన్న' మరింత మంచి పేరు సంపాదించి పెట్టింది. ఆ సినిమా సునీల్ కు కెరీర్ బెస్ట్ గా నిలచింది. ఆ తరువాత సునీల్ హీరోగా స్థిరపడ్డాడు. పలు చిత్రాల్లో నాయక పాత్రలే పోషించాడు. 'పూలరంగడు' మినహా, సునీల్ హీరోగా నటించిన చిత్రాలేవీ అంతగా ఆకట్టుకోలేకపోయాయి.  దాంతో మిత్రుడు త్రివిక్రమ్ సూచన మేరకు మళ్ళీ  నవ్వించే ప్రయత్నం మొదలు పెట్టాడు సునీల్. కొన్ని సార్లు కితకితలు పెట్టాడు. మరికొన్ని సార్లు సెంటిమెంట్ తోనూ కొట్టాడు. అయినా మునుపటి వైభవం సునీల్ కు కనిపించలేదు. ఈ మధ్య  'కలర్ ఫోటో' అనే సినిమాలో విలన్ గానూ నటించి ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. 'కనబడుట లేదు' అనే చిత్రంలో డిటెక్టివ్  రామకృష్ణ పాత్రను పోషిస్తున్నాడు. అల్లు అర్జున్ 'పుష్ప'తో సహా మరికొందరు యంగ్ హీరోస్ చిత్రాల్లోనూ సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నాడు. మరి ఈ సినిమాల్లో ఏది సునీల్ కు గత వైభవం తెచ్చి పెడుతుందో చూడాలి.