బర్త్ డే : నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు

బర్త్ డే : నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు  ఈ పేరు తెలియని తెలుగువాళ్లు ఉండరు. తెలుగు సినిమా చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన నటుడు అక్కినేని. సెప్టెంబర్ 20న అక్కినేని జయంతి. నాటక రంగం నుండి సినిమాల వైపు వచ్చిన ఏఎన్నార్ తన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు. ప్రముఖ చిత్రనిర్మాత ఘంటసాల బలరామయ్య విజయవాడ రైల్వే స్టేషన్లో అక్కినేని చూసారు . ఆ తరువాత సినిమాలకు పరిచయం చేసారు. ధర్మపత్ని సినిమాతో అక్కినేని  సినీజీవితానికి తెరలేచింది. తెలుగు, తమి‌ళ సినిమాలలో 75సంవత్సరాల పైగా నటించారు. తెలుగు సినీపరిశ్రమకు ఎన్టీఆర్ తోపాటు మరో మూలస్థంభంగా నిలిచారు ఎన్నార్. సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నటసామ్రాట్. అక్కినేని తొలి స్వర్ణోత్సవ చిత్రం ‘దసరాబుల్లోడు’, తెలుగులో తొలి ద్విపాత్రాభినయం చేసిన నటుడు అక్కినేని. ‘సీతారామ జననం’ ,‘మాయాబజార్’, ‘చెంచులక్ష్మీ’, ‘భూకైలాస్’, ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’, ‘బాలరాజు’, ‘రోజులు మారాయి’,  ‘మిసమ్మ’, ‘గుండమ్మకథ’, ‘సంసారం’, ‘బ్రతుకు తెరువు’, ‘ఆరాధన’, ‘దొంగ రాముడు’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘అర్థాంగి’, ‘మాంగల్యబలం’, ‘ఇల్లరికం’, , ‘వెలుగు నీడలు’, ‘దసరా బుల్లోడు’, ‘భార్యాభర్తలు’, ‘ధర్మదాత’, ‘బాటసారి’, ‘దేవదాసు’, ‘ప్రేమనగర్’, ‘ప్రేమాభిషేకం’, ‘మేఘసందేశం’, ‘సీతారామయ్య గారి మనమరాలు’.. ఇలా ఎన్నో మరెన్నో అద్భుతమైన సినిమాలు చేసారు అక్కినేని. అన్నపూర్ణ స్టూడియోస్ నెలకొల్పి ఎంతో మందికి సినిమాను మరింత దగ్గర చేసారు. తుదిశ్వాస వరకూ నటిస్తూనే ఉండాలనే తన కోరికను నెరవేర్చుకున్నారు అక్కినేని. ఆయన జయంతి సందర్భంగా ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు సినీప్రముఖులు.