అల... 'స్టైలిష్ స్టార్' అలా అలా...

అల... 'స్టైలిష్ స్టార్' అలా అలా...

'అల...వైకుంఠపురములో' అఖండవిజయంతో ఆనందసీమల్లో అలరారుతున్నాడు అల్లు అర్జున్. ఆయన కాల్ షీట్స్ కూడా కాస్ట్లీగా మారిపోయాయి. 'స్టైలిష్ స్టార్' తమ సినిమాల్లో నటిస్తే చాలు అనుకొనే నిర్మాతలు బన్నీ డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. ప్రస్తుతం 'పుష్ప'గా ముస్తాబవుతున్న అల్లు అర్జున్ ఇకపై మరింత స్పీడు పెంచే యోచనలో ఉన్నాడు. బన్నీ దృష్టి బాలీవుడ్ పైకీ ప్రసరిస్తోంది. సుకుమార్ తెరకెక్కించే 'పుష్ప'తోనే హిందీ చిత్రసీమనూ చుట్టేసే ప్రయత్నంలో ఉన్నాడు బన్నీ. 

అసలే...'దేశముదురు'... 
బాల్యం నుంచీ సినిమా వాతావరణంలోనే పెరగడం వల్ల అల్లు అర్జున్ మనసు ఆటోమేటిగ్గా చిత్రసీమవైపే పరుగులు తీసింది. తాత అల్లు రామలింగయ్య మహా హాస్యనటుడు. తండ్రి అల్లు అరవింద్ నిర్మాతగా ఎంతో పేరున్నవారు. మరోవైపు మేనమామ చిరంజీవి అభినయం ఆరంభం నుంచీ బన్నీని ఆకట్టుకుంటూనే ఉంది. ఇలా ఎటు చూసినా, బన్నీ మనసును సినిమారంగంవైపు తీసుకువెళ్ళే అంశాలు చుట్టూ ఉండేవి. మామ చిరంజీవి డాన్సుల్లోనూ, ఫైట్స్ లోనూ మేటి అనిపించుకున్నారు. అదే పంథాలో పయనించాలని బన్నీ మొదట్లోనే డాన్సుల్లో రాణించాడు. చిరంజీవితో అల్లు అరవింద్ నిర్మించిన 'డాడీ' సినిమాలో బన్నీ కాసేపు డాన్స్ చేస్తూ కనిపించి, ఎంతగానో ఆకట్టుకున్నాడు. తరువాత తండ్రి ప్రోత్సాహంతో 'గంగోత్రి' ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందించిన 'గంగోత్రి' బన్నీకి మంచి మార్కులే సంపాదించి పెట్టింది.

తరువాత దిల్ రాజు నిర్మించిన 'ఆర్య'తో సుకుమార్ దర్శకునిగా పరిచయం అయ్యాడు. అందులో 'ఆర్య'గా బన్నీ అలరించిన తీరు జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఈ రెండు చిత్రాల విజయంతో హుషారుగా సాగుతున్న బన్నీని పూరి జగన్నాథ్  'దేశముదురు'గా తీర్చిదిద్దాడు. ఈ సినిమా అనూహ్య విజయం సాధించడమే కాదు, ఇప్పటికీ బన్నీ కెరీర్ లో అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న చిత్రంగా నిలచే ఉంది. ఈ సినిమాతోనే బన్నీ స్టైలిష్ స్టార్ గానూ జేజేలు అందుకున్నాడు. ఇందులో బన్నీ తన సిక్స్ ప్యాక్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేశాడు. ఎంతోమంది ఇతర హీరోలు సిక్స్ ప్యాక్ పై మనసు పారేసుకొనేందుకు కారణమయ్యాడు.  

అల... అలా అలా...!
తొలి నుంచీ కష్టపడి పనిచేయడం బాగా అలవాటయిన బన్నీ తన దరికి చేరిన ప్రతి పాత్రలోనూ తొలి సినిమాలో నటిస్తున్నట్టే భావించి నటించాడు. "బన్నీ, బద్రీనాథ్, వేదం, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి" వంటి చిత్రాలతో నటునిగా మంచి మార్కులు కొట్టేసిన బన్నీ, 'రేసుగుర్రం'తో మరో సాలిడ్ హిట్ పట్టేశాడు. అయితే వాటితో బన్నీకి ఆనందం కలగలేదు. ఎందుకంటే తన సీనియర్స్, తన తరం హీరోలు ఏదో ఒక సందర్భంలో బ్లాక్ బస్టర్స్ ను తమ ఖాతాలో వేసుకున్నారు. బన్నీకి భలేగా విజయాలు నమోదు అయ్యాయే కానీ, 'ఈ సంవత్సరం నాది' అని చెప్పుకొనే స్థాయిలో బ్లాక్ బస్టర్ పడలేదు. అల్లు అర్జున్ అభిలాషను తీర్చడానికి అన్నట్టు త్రివిక్రమ్ అతనికి 'అల...వైకుంఠపురములో' వంటి బంపర్ హిట్ ను అందించాడు. 2020 సంక్రాంతి సంబరాల్లో 'అల...వైకుంఠపురములో' చిత్రానిదే పైచేయిగా నిలచింది.

బన్నీ ఆశించిన బంపర్ హిట్ ఆయన సొంతమయింది. ఈ సినిమా వసూళ్ళలో 'నాన్-బాహుబలి' రికార్డును సొంతం చేసుకోగా, పాటల్లో మాత్రం ఎవరికీ అందనంత ఎత్తున నిలచింది. ఈ చిత్రంలోని మూడు పాటలు రెండువందల మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి అరుదైన రికార్డు సృష్టించాయి. టాప్ టెన్ లో 'అల...వైకుంఠపురములో'లోని మూడు పాటలు నిలవడం మరో రికార్డు. ఇలా అనేక రికార్డులను తన సొంతం చేసుకున్న అల్లు అర్జున్ తాజా చిత్రం 'పుష్ప' కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి తన 'ఆర్య' దర్శకుడు సుకుమార్ తో ముచ్చటగా మూడోసారి పనిచేస్తున్న బన్నీ 'పుష్ప'తో ఏ స్థాయి సక్సెస్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.