హ్యాపీ బర్త్ డే : అతిలోక సుందరి శ్రీదేవి

హ్యాపీ బర్త్ డే : అతిలోక సుందరి శ్రీదేవి

శ్రీదేవి... ఈ పేరు తెలియని సినిమా అభిమాని ఉండదు. పాత తరం నుంచి నేటి తరం వరకు అందరికి ఆమె పేరు సుపరిచితమే.  బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసి.. తమిళ తెలుగు భాషల్లో నటించింది.  రామారావు, నాగేశ్వర రావులకు మానవరాలిగా నటించిన శ్రీదేవి.. పెద్దయ్యాక వారి సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది.  దక్షిణాది, ఉత్తరాది భాషల్లో ఆమె నటించిన సినిమాలు కోకొల్లలు.  అప్పట్లో శ్రీదేవి సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు థియేటర్ల వద్ద క్యూలు కట్టేవారు.  

1963 ఆగస్టు 13 వ తేదీన జన్మించిన శ్రీదేవి, 1967 లో వచ్చిన కణ్ణన్ కరుణై అనే సినిమా ద్వారా బాలనటిగా వెండితెరకు పరిచయం అయ్యింది.  16 ఏళ్ల వయసు సినిమాతో హీరోయిన్ గా మారింది.  బాలచందర్ దర్శకత్వంలో ఆమె ఎన్నో సినిమాల్లో నటించారు.  తమిళ్ స్టార్ నటులు రజినీకాంత్, కమల్ హాసన్ లతో కలిసి ఎన్నో సినిమాలు చేసింది. 1975 నుంచి 1985 మధ్యకాలంలో శ్రీదేవి తమిళంలో టాప్ హీరోయిన్ గా కొనసాగింది.  

ఇక తెలుగులో కూడా ఆమె నటించిన సినిమాలు అనేకం.  అప్పట్లో ఎన్టీఆర్, నాగేస్వర రావు, కృష్ణ, శోభన్ బాబు వంటి అగ్రనటులు, ఆ తరువాత తరమైన మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తదితరులతో సినిమాలు చేసింది.  తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన శ్రీదేవి 1996 లో బాలీవుడ్ సినీ నిర్మాత బోనికపూర్ ను వివాహం చేసుకుంది.  వీరికి ఇద్దరు పిల్లలు.  జాన్వీ కపూర్, ఖుషి కపూర్.  జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా చూడాలన్నది ఆమె కల.  ఆ కల నెరవేరకుండానే ఆమె కన్ను మూసింది.  ఫిబ్రవరి 24, 2018 వ సంవత్సరంలో శ్రీదేవి దుబాయ్ లోని ఓ హోటల్ గదిలో స్నానాల గదిలో ప్రమాదవశాత్తు టబ్ లో జారిపడి మరణించారు.