టాలీవుడ్‌ మన్మథుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు..

టాలీవుడ్‌ మన్మథుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు..

టాలీవుడ్ మన్మథుడు, యువసామ్రాట్, కింగ్ నాగార్జునకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది ఎన్టీవీ... 60వ వసంతంలోకి అడుగు పెడుతోన్న ఈ నవ మన్మథుడు మరింత కాలం టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాలని ఆకాంక్షిస్తోంది. 60 ఏళ్ల వయస్సులోనూ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా.. ఓవైపు తన కుమారులతో సైతం పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు నాగ్. తాజాగా విడుదలైన మన్మథుడు 2తో మరోసారి ఆయన ప్రేక్షకులను అలరించారు. 1959 ఆగస్టు 29న ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు- అన్నపూర్ణ దంపతులకు రెండో కుమారుడిగా నాగార్జున జన్మించారు. చెన్నై జన్మించిన నాగార్జున.. ఆ తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను, లిటిల్ ప్లవర్ స్కూల్‌లో ఇంటెర్మీడియట్ విద్యను అభ్యసించారు. తర్వాత మద్రాస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ఇక, తన తండ్రి నాగేశ్వరరావు వారసత్వాన్ని పునికిపుచ్చుని 1986లో 'విక్రమ్' సినిమాతో అరంగ్రేటం చేసిన నాగ్.. తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు. అలాగని ఆయన సినీ కెరీర్ మొత్తం సాఫీగా సాగిపోలేదు.. ఆయన కెరీర్‌లో ఫ్లాప్‌లు కూడా పలకరించాయి. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడి.. టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. 

ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు నిర్మతగా కూడా పలు సినిమాలను నిర్మించారు. సిల్వర్ స్రీన్‌తో పాటు బుల్లితెరపై కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు నాగ్. "మీలో ఎవరు కోటీశ్వరు"తో బుల్లితెర ప్రేక్షకులకు చేరువైన ఆయన.. ఇప్పుడు బిగ్‌బాస్ 3తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక ఆయన నటించిన సినిమాల్లో మజ్ను, కలెక్టరుగారి అబ్బాయి, ఆఖరి పోరాటం, గీతాంజలి, శివ, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, హలో బ్రదర్, నిన్నే పెళ్లాడుతా, అన్నమయ్య, శ్రీ రామదాసు, కింగ్, మనథ్ముడు, మనం.. ఇలా ఎన్నో హిట్ మూవీలు అందించారు. ఇక, మనం సినిమాలో అక్కినేని ఫ్యామిలీ మొత్తం కనిపించడం మరో విశేషం. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు, కుమారులు నాగచైతన్య, అఖిల్, కోడలు సమంత (అప్పటికి పెళ్లి జరగలేదు).. తాను కలిసి నటించి మంచి హిట్ అందుకున్నారు. నాగార్జున నూతన దర్శకులను ప్రోత్సహించి తాను నిర్మించే సినిమాలకు దర్శకత్వము వహించే అవకాశాలు ఇచ్చారు. శివ చిత్రాన్ని హిందీలో శివ అనే పేరుతోనే పునర్నిర్మించి బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టారు. మరోవైపు తన కెరీర్‌లో జాతీయ పురస్కారాలతో పాటు, నంది అవార్డులు, ఫిల్మ్‌పేర్ అవార్డులు.. ఇలా పలు అవార్డులను కూడా దక్కించుకున్నారాయన. మరో సారి టాలీవుడ్ కింగ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.