హ్యాపీ బర్త్ డే విరాట్ కోహ్లీ

హ్యాపీ బర్త్ డే విరాట్ కోహ్లీ

రన్‌ మెషీన్‌, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఈ రోజు 31 వ వడిలోకి అడుగుపెట్టాడు. తన పుట్టిన రోజును వేడుకలను భార్య అనుష్కశర్మతో చేసుకొనేందుకు ఆమెతో కలిసి విహారానికి వెళ్లాడు. వీరిద్దరూ మన పొరుగు దేశమైన భూటాన్‌లో హాయిగా విహారిస్తున్నారు. భర్తతో గడుపుతున్న ఈ హ్యాపీ మూమెంట్స్ కి సంబందించిన వీడియోలను అనుష్క తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఇప్పుడు  ఈ ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే గత సంవత్సరం జన్మదినాన విరుష్క జోడీ ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం హరిద్వార్‌లో గడపడం విశేషం. ఈసారి వాళ్లు భూటాన్‌ వెళ్లారు.

ఇక కోహ్లీ తన శరీరంపై 9 టాటూలు వేయించుకున్నాడట. ఈ టాటూల వెనుక ప్రత్యేక అర్థం కూడా ఉందట. గత ఏడాది నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్‌లో ప్రసారమైన డాక్యుమెంటరీలో కోహ్లీ తన శరీరంపై ఉన్న టాటూలకు సంబంధించిన వివరాలను వెల్లడించాడు. తన చేతి వెనుక పైభాగంలో తన తల్లిదండ్రుల పేర్లు వేయించుకున్నాడు. కోహ్లీ మహాశివుని భక్తుడు కావడంతో ఎడమ చేతిపై కైలాస పర్వతంపై ధ్యానముద్రలో ఉన్న శివుని టాటూ వేయించుకున్నాడు. అలాగే కుడి చేతిపై శాంతి, శక్తిలకు చిహ్నమైన మోనెస్ట్రీ గుర్తు వేయించుకున్నాడు.

కోహ్లీ తన శరీరంపై ట్రైబల్ ఆర్ట్ కూడా వేయించుకున్నాడు. అలాగే కుడి చేతిపై జాడియక్ సైన్ స్కార్పియో టాటూను వేయించుకున్నాడు. అలాగే అదే చేతిపై జపాన్ సమురాయ్ యోధుని టాటూ వేయించుకున్నాడు. దీనిని కోహ్లీ గుడ్‌లక్‌గా భావిస్తాడు. ఎడమ చేయి భుజంపై ‘గాడ్స్ ఐ’ టాటూ వేయించుకున్నాడు. ఇక ఈసారి కోహ్లీ పుట్టినరోజున స్టార్‌స్పోర్ట్స్‌ సూపర్‌ ‘వి’ పేరిట రూపొందించిన సిరీస్‌లో తొలి ఎపిసోడ్‌ నేడు మధ్యాహ్నం 3.30) ప్రసారం కానుంది. 15 ఏళ్ల వయస్సులో పోటీ క్రికెట్‌లో అడుగుపెట్టినప్పటినుంచి టీమిండియా కెప్టెన్‌ అయ్యే క్రమంలో కోహ్లీ ఎదుర్కొన్న కష్ట నష్టాలను, సాధించిన విజయాలను ఈ ఎపిసోడ్లలో కళ్ళకు కట్టినట్టు చూపించనున్నారు.

అలాగే చిన్నతనంలో తల్లిదండ్రులు, సోదరి, స్నేహితులు, టీచర్లతో విరాట్‌ సంబంధాలను కళ్లకు కట్టనున్నారు. మొత్తంగా సూపర్‌ ’వి’ దేశ టీనేజర్లకు స్ఫూర్తినిచ్చేలా రూపొందించారు. మొదటి ఎపిసోడ్‌ ఈరోజు పుట్టిన రోజు సందర్భంగా టెలికాస్ట్‌ కానున్నా మిగిలిన 11 తదుపరి ఆదివారాలు ఉదయం 9 గంటలనుంచి స్టార్‌ప్లస్‌, స్టార్‌ స్పోర్ట్స్‌, డిస్నీ, మార్వెల్‌ హెచ్‌క్యూ, హాట్‌స్టార్‌లో ప్రసారమవుతాయి. ఇక ప్రస్తుతం టీమిండియా బంగ్లాదేశ్ తో టీ 20 సిరీస్ తలపడుతుండగా ఈ సిరీస్ కి కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతి కల్పించారు.