సిడ్నీ టెస్టు‌కు హార్దిక్ పాండ్యా?

సిడ్నీ టెస్టు‌కు హార్దిక్ పాండ్యా?

నాలుగు టెస్ట్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే చివరి టెస్టు కోసం టీమిండియా జట్టు ఎంపికపై తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. రెగ్యులర్ ఓపెనర్లు మురళీ విజయ్, కేఎల్ రాహుల్‌లు మొదటి రెండు టెస్టుల్లో విఫలమవడంతో.. మూడో టెస్టులో మయాంక్ అగర్వాల్, హనుమ విహారీలను తీసుకుంది. మయాంక్ తన ఆటతో ఆకట్టుకోగా.. విహారి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పరుగులు చేయలేదు. ఈ నేపథ్యంలో విహారీని మళ్లీ మిడిలార్డర్‌లోనే ఆడిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

టెస్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ భార్య రితిక ఆదివారం ఆడబిడ్డకి జన్మనివ్వడంతో.. అతను భారత్‌కి వచ్చేశాడు. దీంతో రోహిత్ సిడ్నీ టెస్టుకి దూరం కానున్నాడు. ఆ స్థానాన్ని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో భర్తీ చేయాలని టీం మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోంది. ఓపెనర్ గా విహారి విఫలమవడంతో.. రోహిత్ శర్మ స్థానంలో మళ్లీ విహారికే అవకాశం ఇవ్వాలని కొందరు అభిప్రాయపడుతుండగా.. నాలుగో టెస్టులోనూ అతడ్నే ఓపెనర్‌గా ఆడించాలని మరికొందరు అంటున్నారు. అయితే చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సైతం చివరి రెండు టెస్టుల్లోనూ విహారి ఓపెనర్‌గా ఆడతాడని ఇప్పటికే ప్రకటించేశాడు. దీంతో టీమ్‌లో హార్దిక్ పాండ్య రావడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు గాయం నుంచి కోలుకుని స్పిన్నర్ అశ్విన్ ఫిట్‌గా ఉంటే జడేజా స్థానంలో జట్టులోకి వచ్చే  అవకాశం ఉంది. అయితే మూడో టెస్టులో జడేజా బంతితో రాణించాడు. ఈ నేపథ్యంలో మరి కెప్టెన్ ఎవరికి తీసుకుంటాడో చూడాలి. మొత్తంగా భారత జట్టు తుది ఎంపికపై కసరత్తులు చేస్తోంది.