ధోనీ.. నా హెలికాప్టర్ షాట్ ఎలా ఉంది..?

ధోనీ.. నా హెలికాప్టర్ షాట్ ఎలా ఉంది..?

ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ ముంబయి ఆటగాడు హార్దిక్ పాండ్యా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. గురువారం రాత్రి ఫిరోజ్ షా కోట్ల వేదికగా జరిగినమ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ బ్యాట్స్‌మెన్‌లను తన బౌలింగ్‌తో ఇబ్బందిపెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ అగ్రశ్రేణి ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ బౌలింగ్‌లోనూ హార్దిక్ పాండ్య హెలికాప్టర్ షాట్‌‌ ఆడి సిక్స్ బాదడం కొసమెరుపు. లెగ్‌స్టంప్‌పై పడ్డ బంతిని హెలికాప్టర్ షాట్‌తో డీప్ మిడ్‌వికెట్ మీదుగా స్టాండ్స్‌లోకి పంపాడు. ఐతే తర్వాతి బంతికే హార్డిక్ ఔటైనా ఆఖర్లో తన సోదరుడు క్రునాల్ రెండు ఫోర్లు బాదడంతో ముంబయి మంచి స్కోరు సాధించింది. ఆఖరి 3 ఓవర్లలో ముంబై 50 పరుగులు రాబట్టడం విశేషం. హార్దిక్ హెలికాప్టర్ షాట్ సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. 

ధోనీ తరహాలో హెలికాప్టర్ షాట్‌ ఆడటాన్ని అతని దగ్గరే నేర్చుకున్నావా..? అని హార్దిక్ పాండ్యాని ప్రశ్నించగా.. ‘హెలికాప్టర్ షాట్ ఆడటాన్ని నేను నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుంటాను. కానీ.. మ్యాచ్‌లో ఆడతానని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. చెన్నైపై మ్యాచ్‌లో హెలికాప్టర్ షాట్ ద్వారా సిక్స్ కొట్టిన తర్వాత.. ధోనీ రూమ్‌కి వెళ్లి.. నా హెలికాప్టర్ షాట్ ఎలా ఉంది..? అని అడిగాను. దానికి ధోనీ.. చాలా బాగుంది అని సమాధానమిచ్చాడు’ అని హార్దిక్ పాండ్య వెల్లడించాడు.