ఆసీస్ వన్డే సిరీస్ కి హార్దిక్ పాండ్యా దూరం

ఆసీస్ వన్డే సిరీస్ కి హార్దిక్ పాండ్యా దూరం

ఫిబ్రవరి 24 నుంచి భారత్-ఆస్ట్రేలియా సిరీస్ ప్రారంభమవుతోంది. సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. ఈ సిరీస్ నుంచి ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వైదొలిగాడు. పాండ్యా స్థానంలో మరో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకున్నారు.

వెన్ను కింద భాగం గాయం కారణంగా హార్దిక్ పాండ్యా భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ఆడబోవటం లేదు. బీసీసీఐ మెడికల్ బృందం ఈ ఆల్ రౌండర్ కి విశ్రాంతి అవసరం అని సూచించింది. హార్దిక్ లోయర్ బ్యాక్ గాయంతో బాధపడుతున్నట్టు తెలిసింది.

హార్దిక్ పాండ్యా ఇక బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి (ఎన్సీఏ) వెళ్తాడు. అక్కడ అతని గాయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అక్కడే ఉండి హార్దిక్ రాబోయే వరల్డ్ కప్ కోసం ఫిట్ నెస్ సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. 

హార్దిక్ పాండ్యా వచ్చే వారం నుంచి ఎన్సీఏలో స్ట్రెంగ్త్, ఫిట్ నెస్ లకు సంబంధించిన కసరత్తులు ప్రారంభిస్తాడు. భారత పర్యటనకు వస్తున్న ఆస్ట్రేలియా జట్టుతో టీమిండియా 2 టీ20 మ్యాచ్ లు, 5 వన్డేల సిరీస్ ఆడనుంది.

టీ20 జట్టులో 14 మంది సభ్యులు ఉన్నారు. రవీంద్ర జడేజాను 5 మ్యాచ్ ల వన్డే సిరీస్ కోసం హార్దిక్ పాండ్యా స్థానంలో చేర్చారు. గత ఏడాది ఆసియా కప్ లో గాయం కారణంగా హార్దిక్ కొంత కాలం జట్టు నుంచి బయట గడిపాడు. ఈ ఏడాది న్యూజిలాండ్ టూర్ లో తిరిగి టీమ్ లోకి వచ్చాడు.