రూ.7,000 కోట్లు గంగలో పోశారు

రూ.7,000 కోట్లు గంగలో పోశారు

దేశంలో ప్రతిష్ఠాత్మక గంగానది శుద్ధి కోసం రూ.7,000 కోట్లు ఖర్చు చేశారు. కానీ ప్రయోజనం మాత్రం శూన్యం. గంగానది పరిస్థితి ఎప్పటిలాగే మురికిగా ఉంది. ఇంకా చెప్పాలంటే శుద్ధి కార్యక్రమాలు చేపట్టాక మరింత అధ్వాన్నంగా తయారైంది. ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) వ్యాఖ్యలు. గంగానది శుద్ధి పూర్తి కాకపోవడంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందు నుంచి గంగానది మురికి కాల్వలాగా తయారైంది. ఇప్పటి వరకు జరిగిన పనులు చూస్తే అసలు పనులు జరిగిన ఆనవాళ్లే కనిపించడం లేదని ఎన్జీటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. గంగ శుద్ధిపై అధికారులు చెబుతున్న మాటలన్నీ ఉత్తివేనని జస్టిస్ ఏకే గోయల్ నేతృత్వంలో జస్టిస్ జవాద్ రహీం, జస్టిస్ ఆర్.ఎస్. రాథోడ్ లతో కూడిన ధర్మాసనం కుండబద్దలు కొట్టింది. ఇందుకోసం నిరంతరం పర్యవేక్షణ తప్పనిసరని సూచించింది. దేశప్రజల భక్తి, మనోభావాలతో ముడిపడిన గంగానదిని రక్షించుకోకపోవడం క్షమార్హం కాదని తెలిపింది. ఇందుకోసం శుద్ది కార్యక్రమాలు నిర్వహిస్తున్న అధికారులకు ప్రజల నుంచి ఈమెయిళ్ల ద్వారా గంగానదిలో వ్యాపించిన కాలుష్యంపై అభిప్రాయ సేకరణ జరిపిస్తే పరిస్థితి తీవ్రత అర్థమవుతుందని వ్యాఖ్యానించింది.

అంతకు ముందు ఎన్జీటీ జాతీయ స్వచ్ఛ గంగా మిషన్ లో భాగంగా గోముఖ్-ఉన్నావ్ ల మధ్య గంగ శుద్ధికి చేపట్టిన పనులపై కేంద్రం, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఎలాంటి నివేదిక సమర్పించకపోవడాన్ని తప్పుబట్టింది.