హర్షద్ మెహతా భార్యకు రూ.6 కోట్లు

హర్షద్ మెహతా భార్యకు రూ.6 కోట్లు

షేర్ మార్కెట్ లో సంచలనం సృష్టించిన కుంభకోణంలో నిందితుడు హర్షద్ మెహతా భార్య జ్యోతి మెహతాకు 27 ఏళ్ల న్యాయపోరాటంలో విజయం లభించింది. ఒక బ్రోకర్ హర్షద్ మెహతా నుంచి తీసుకున్న డబ్బు తిరిగివ్వలేదు. దీనిపై కోర్టుకి వెళ్లిన జ్యోతి మెహతాకు 18% వడ్డీతో కలిపి డబ్బు తిరిగి ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పు 30 రోజుల తర్వాత అమల్లోకి వస్తుంది. ఆలోగా ప్రతివాది సుప్రీంకోర్టులో ఈ తీర్పుని సవాల్ చేయవచ్చు.

1992లో జరిగిన షేర్ కుంభకోణం కేసులను స్పెషల్ కోర్ట్ జడ్జి శాలిని ఫన్సాల్కర్ జోషి విచారణకు చేపట్టారు. బ్రోకర్ కిషోర్ జనానీ, ఫెడరల్ బ్యాంక్ తన భర్త నుంచి రూ.6 కోట్లు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదంటూ హర్షద్ మెహతా భార్య తన పిటిషన్ లో ఆరోపించారు. 1992 నుంచి ఇప్పటి వరకు వడ్డీతో సహా తన డబ్బు తనకి వాపసు ఇప్పించాలని జ్యోతి డిమాండ్ చేశారు. జ్యోతి వాదన సరైనదేనని కోర్టు తీర్పు చెప్పింది.

జ్యోతి ఆరోపణలు అవాస్తవాలని ప్రతివాదులు వాదించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత దావా వేయడాన్ని వారు ప్రశ్నించారు. కానీ ఈ కేసులో లా ఆఫ్ లిమిటేషన్ వర్తించదని కోర్టు స్పష్టం చేసింది. డబ్బు వసూలు చేసి హర్షద్ మెహతా అప్పులవాళ్లకి పంచాల్సిందిగా జడ్జి జోషి కస్టోడియన్ ను ఆదేశించారు. జ్యోతి మెహతా కోర్టులో రెండు వేర్వేరు దావాలు వేశారు. ఒక పిటిషన్ లో ఆమె రూ.4 కోట్లు, రెండో దానిలో రూ.2.60 కోట్లు వాపసు ఇప్పించాలని అప్పీల్ చేశారు. కోర్ట్ ఈ రెండు కేసుల్లో బాంబే స్టాక్ ఎక్స్చేంజీ నుంచి వడ్డీతో సహా ఈ డబ్బు వసూలు చేయాలని కస్టోడియన్ కు కోర్ట్ సూచించింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజీలోనే బ్రోకర్ ఈ డబ్బు పెట్టుబడి పెట్టాడు.

90వ దశకంలో హర్షద్ మెహతా షేర్ మార్కెట్లో రూ.4,000 కోట్లకు పైగా కుంభకోణం చేశాడు. 1992లో సీబీఐ ‘బిగ్ బుల్’ పేరుతో ప్రసిద్ధికెక్కిన హర్షద్ మెహతా చీకటి వ్యవహారాలను బట్టబయలు చేసింది. హర్షద్ మెహతా బ్యాంకుల నుంచి 15 రోజులకి రుణం తీసుకొని దానిని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవాడు. 15 రోజుల్లో బ్యాంకులకు వడ్డీతో సహా డబ్బు తిరిగి చెల్లించేవాడు. ఒక బ్యాంక్ నుంచి నకిలీ పత్రాలు తయారు చేయించి రెండో బ్యాంకులో పెట్టి సునాయాసంగా అప్పు పుట్టించేవాడు.