'డేరా బాబా' పెరోల్‌కు ప్రభుత్వం సానుకూలం..!

'డేరా బాబా' పెరోల్‌కు ప్రభుత్వం సానుకూలం..!

డేరా స్వచ్ఛా సౌధా చీఫ్‌ గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్‌ను పెరోల్‌పై బయటకు తెచ్చేందుకు హర్యానా ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. మైనర్లపై అత్యాచారం కేసులో 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్న గుర్మిత్‌ పరోల్‌ కోసం నెల క్రితమే హర్యానా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. ఆ పిటిషన్‌ను తిరస్కరించిన న్యాయస్థానం.. గుర్మిత్‌ బయటికొస్తే లా అండ్‌ ఆర్డర్‌ ప్రాబ్లెమ్స్‌ వస్తాయని పేర్కొంది. తాను వ్యవసాయం చేసుకునేందుకు వీలుగా పెరోల్ ఇప్పించాలంటూ సిర్సా జైలు అధికారులకు డేరా బాబా దరఖాస్తు చేసుకున్నాడు. జైలులో తన ప్రవర్తన కూడా సంతృప్తికరంగా ఉన్నందున తాను పెరోల్‌కు అర్హుడనని ఆ దరఖాస్తులో ఆయన పేర్కొన్నాడు.  

ఏడాది శిక్ష అనుభవించిన సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు పరోల్‌ ఇచ్చే అవకాశం ఉందని, ఆ నిబంధన గుర్మిత్‌కు కూడా వర్తిస్తుందని ఆ రాష్ట్ర జైళ్ల శాఖ మంత్రి పాన్వార్‌ చెబుతున్నారు. ఈ విషయంలో న్యాయస్థానం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. గుర్మిత్‌ పరోల్‌కి, త్వరలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధం లేదని అన్నారు. తమ ఉద్దేశం అదే అయితే లోక్‌సభ ఎన్నికల ముందే ఆయనని విడుదల చేసేవాళ్లం కదా అని ప్రశ్నించారు. జైలులోరామ్ రహీమ్‌ సింగ్ ప్రవర్తన మంచిగా ఉందని, ఏ నిబంధనలనూ  అతిక్రమించ లేదని జైల్ సూపరింటెండెంట్.. కోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. 

ఐతే.. రామ్‌రహీమ్‌ను బయటకు తెచ్చేందుకు అధికార పార్టీ ఎందుకు అత్యుత్సాహం చూపిస్తోందని కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రామ్‌రహీమ్‌కు బీజేపీ టికెట్‌ ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లదని పేర్కొంటోంది.