అత్తపై కోడలి దాష్టికం: వైరల్ 

అత్తపై కోడలి దాష్టికం: వైరల్ 

హర్యానాలో దారుణం జరిగింది. వృద్ధురాలు అనే కనికరం లేకుండా అత్తను చిత్రహింసలకు గురిచేసింది ఓ కోడలు. ఇష్టారీతిన ఆమెను కొడుతూ అసభ్యపదజాలంతో దూషించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాంద్‌ బాయీ భర్త సరిహద్దు భద్రతా బలగాల విభాగంలో ఎస్సైగా పనిచేసేవాడు. అతడి మరణానంతరం చాంద్‌ బాయీకి ప్రభుత్వ పెన్షన్‌ 30 వేలు వస్తోంది. ప్రస్తుతం ఆమె తన కోడలు కంటా బాయితో కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలో ఆమె దగ్గరున్న డబ్బు కోసం కంటా బాయీ.. అత్తను వేధించేది. వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న చాంద్‌ బాయిని అస్సలు సహించేది కాదు. ఓరోజు ఆరు బయట మంచంలో పడుకున్న చాంద్‌ బాయిని జుట్టుపట్టుకుని ఈడ్చిపారేసింది. అనంతరం అభ్యంతరకర భాష వాడుతూ ఆమెను తీవ్రంగా కొట్టింది. ఈ క్రమంలో పక్కింట్లో ఉన్న విద్యార్థిని ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు కంటా బాయిని అరెస్టు చేశారు. 
 
ఈ ఘటనపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ కట్టార్‌ స్పందించారు. వృద్ధురాలన్న కనీస కనికరం లేకుండా కోడలు అత్తను చిత్ర హింసలు పెట్టిన ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి పాల్పడిన మహిళను అరెస్టు చేశామని ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా శనివారం వెల్లడించారు. ఆ వీడియోను షేర్ చేస్తూ, ట్వీట్ చేశారు. ‘ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. నాగరిక సమాజంలో ఇలాంటి చర్యలను ఏ మాత్రం సహించం’ అని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.