హాజీపూర్ బాధిత కుటుంబాలను ఆదుకుంటాం

హాజీపూర్ బాధిత కుటుంబాలను ఆదుకుంటాం

హాజీపూర్ బాధిత కుటుంబాలను ఆదుకుంటామని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్ అన్నారు. శనివారం బాలికల కుటుంబసభ్యులతో కలెక్టర్ చర్చలు జరిపారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల సహాయన్ని బాధిత కుటుంబాలకు అందచేస్తామని అన్నారు. ఎన్నికల కోడ్ పూర్తి అయిన వెంటనే ప్రభుత్వం నుంచి వచ్చే సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. హాజీపూర్ నుంచి మాచనపల్లి వెళ్లే దారిలో ఉన్న బ్రిడ్జ్ నిర్మాణం కోసం రూ.4 కోట్ల అంచనాలను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని అన్నారు. నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి కఠినమైన శిక్షపడేలా పోలీసులు సాక్ష్యాలను సిద్ధం చేశారని తెలిపారు. అన్ని కేసుల్లా కాకుండా ఈ కేసును త్వరితగతిన పూర్తి చేసేలా చూస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. 

హజీపూర్ లో బాలికలపై అత్యాచారం చేసి హత్యలకు పాల్పడ్డ సైకో శ్రీనివాస్ రెడ్డిని ఉరితీయాలని గ్రామస్తులు ఆందోళనకు దిగన విషయం తెలిసిందే. శ్రీనివాస్‌ ను ఉరి తీయకపోతే.. తాము కూడా బావిలోనే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. గత 2 రోజులుగా బాధిత కుటుంబీకులతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు శాంతియుత నిరాహారదీక్ష చేపట్టారు. శుక్రవారం అర్థరాత్రి బాధితులపై, మద్దతుదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ నేపధ్యంలో హజీపూర్ బాధిత కుటుంబసభ్యులతో జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ చర్చలు జరిపారు.