క్లైమాక్స్‌లో కర్ణాటక హైడ్రామా..!

క్లైమాక్స్‌లో కర్ణాటక హైడ్రామా..!

క్షణ క్షణం ఉత్కంఠ రేపుతోన్న కర్ణాటక రాజకీయ హైడ్రామా క్లైమాక్స్‌కు చేరినట్టే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కుమారస్వామి, ప్రతిపక్ష నేత యడ్యూరప్పతో స్పీకర్ రమేష్ కుమార్ చర్చలు జరిపారు. బలపరీక్షకు సిద్ధం కావాలని స్పీకర్‌.. సీఎంను కోరగా.. మరికొంత సమయం కావాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు సీఎం కుమారస్వామి. మరోవైపు బలపరీక్ష నిర్వహించాల్సిందేనని పట్టుబడుతోంది బీజేపీ. ఇక, రాత్రి 7 గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సీఎం భేటీ అవుతారనే వార్తలను ముఖ్యమంత్రి కుమారస్వామి కార్యాలయం ఖండించింది. అయితే, ప్రభుత్వాన్ని నడపడం కష్టమని నిర్ధారణకు వచ్చిన కుమారస్వామి.. బలపరీక్షపై ఓటింగ్‌ జరగకముందే గౌరవపదంగా రాజీనామా చేసి ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు పొలిటిక్ సర్కిల్‌లో చర్చ జరుగుతోంది. మరోవైపు అసెంబ్లీలో విశ్వాసపరీక్షపై సుదీర్ఘమైన చర్చ సాగుతోంది. ఇక, మిత్ర పక్షాలుగా ఉన్న కాంగ్రెస్-జేడీ(ఎస్‌) నేతల మధ్య అసెంబ్లీ వేదికగా విమర్శలు పెరిగాయి. ముఖ్యంగా మాజీ సీఎం, సీఎల్పీ నేత సిద్ధరామయ్య.. జేడీఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నడపడం కష్టమని.. రాజీనామా చేస్తేనే బెటర్ అనే నిర్ణయానికి కుమారస్వామి వచ్చినట్టు ప్రచారం సాగుతోంది.