కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు

కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. బలపరీక్ష నిరూపించుకోవడంలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్ విఫల అవ్వడం.. సీఎం పదవికి కుమారస్వామి రాజీనామా చేయడం.. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిపోయాయి. అయితే, సంకీర్ణ సర్కార్ కూలిపోవడానికి మీరే కారణమంటే.. లేదు మీరే అంటూ కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతల మధ్య మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. సీఎం పదవి కోల్పోయి దాదాపు నెల రోజుల పాటు మౌనంగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి.. ఓ ఇంటర్వ్యూలో కాంగ్రెస్‌ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్యను టార్గెట్ చేశాకు కుమారస్వామి. ఆయనే తన తొలి శత్రువు అని వ్యాఖ్యానించారు. 

సిద్ధరామయ్యపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు  కుమారస్వామి.. తాను ముఖ్యమంత్రి కావడం తొలి నుంచి సిద్దరామయ్యకు ఇష్టం లేదని ఆరోపించిన ఆయన.. సంకీర్ణ సర్కార్‌కు వ్యతిరేకంగా పనిచేసి.. ఎమ్మెల్యేలను రెచ్చగొట్టేలా వ్యవహరించారని మండిపడ్డారు. ఓవైపు సంకీర్ణ సర్కార్‌ను కొనసాగించాలనే ఆసక్తిని కాంగ్రెస్‌ అధిష్ఠానం కనబర్చినా.. సిద్ధరామయ్య మాత్రం ఆ ప్రభుత్వాన్ని ఎలా కూల్చాలనే కుట్రలు చేసేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక కుమారస్వామి వ్యాఖ్యలపై అదే రేంజ్‌లో స్పందించారు సిద్ధరామయ్య... కుమారస్వామికి పాలన చేతగాకే సంకీర్ణ సర్కార్ కూలిపోయిందని.. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికే కుమారస్వామి ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మరోవైపు, కర్ణాటకలో ఇప్పటికే ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు ఇవాళ శాఖలు కేటాయించనున్నారు. ఓవైపు డిప్యూటీ సీఎం పోస్ట్ కూడా ఉండే అవకాశం ఉందని చర్చ జరుగుతోన్న సమయంలో.. అధిష్టానం నా దగ్గర డిప్యూటీ సీఎం పదవి గురించి ప్రస్తావించలేదంటున్నారు సీఎం యడియూరప్ప.