7 నిమిషాలకు అర కోటి ఖర్చు

7 నిమిషాలకు అర కోటి ఖర్చు

వ్యవసాయ రుణమాఫీకి డబ్బులు లేవు. ప్రాజెక్టులు, మౌలిక వసతులకు నిధులు లేవు. ఉద్యోగుల జీతాలకు ఖజానా ఖాళీ. ఇది కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా హెచ్.డి. కుమారస్వామి ప్రమాణం చేసేటప్పటి పరిస్థితి. కానీ అంగరంగ వైభవంగా కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ వేడుకకు జనతాదళ్ (ఎస్) దేశం నలుమూలల నుంచి అగ్రనేతలను ఆహ్వానించింది. వాళ్లంతా కుమారస్వామి కంటే బాగా ఈ ఉత్సవాన్ని ఎంజాయ్ చేసినట్టున్నారు. ఎందుకంటే ఆ బిల్లులు చూస్తే ఎవరికైనా కళ్లు తిరుగుతాయి.

బాబుదే భారీ బిల్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మే 23న ఉదయం 9.49 గంటలకు తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్ లో దిగారు. తర్వాత రోజు ఉదయం 5.34 కి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ 20 గంటల్లో ఆయన చేసిన బిల్లు అక్షరాలా రూ.8,72,485. ఇక సామాన్యుడినని చెప్పుకొనే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా సరిగ్గా చంద్రబాబు దిగిన హోటల్ లోనే అదే సమయానికి చెకిన్, చెకౌట్ అయ్యారు. ఆ రాత్రి అడుగు బయట పెట్టకుండా గదిలోనే డైనింగ్ చేశారు. భోజనాలు, జ్యూసులకు రూ.71,025..ఇతర పానీయాలకు రూ.5,000 ఖర్చయింది. ఇంత బిల్లయ్యేందుకు కేజ్రీవాల్ ఏం తిన్నారు? ఏం తాగారని ఆశ్చర్యపోవాల్సిందే.

కేవలం ఏడంటే ఏడే నిమిషాల పాటు జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి కర్ణాటక ప్రభుత్వం రూ. 42 లక్షలు ఖర్చు చేసినట్టు ఓ సమాచార హక్కు కార్యకర్త తెలుసుకున్నారు. అయితే ఇందులో దేనికి ఎంత ఖర్చయిందో వివరాలు చెప్పలేదు. కానీ ఇదంతా ఎంతో కష్టపడి సంపాదించిన ప్రజల నుంచి పన్నుల రూపంలో ఖజానాకు చేరిన మొత్తంలో నుంచే కావడంతో జనంలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి.

టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపునకు చెందిన బెంగళూర్ మిర్రర్ కథనం ప్రకారం 2013 మే 13న సిద్దరామయ్య, 2018 మే 17న బీఎస్ యడ్యూరప్పల ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర ఆతిథ్య విభాగం, కర్ణాటక ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి వచ్చిన అతిథుల బస కోసం ఎలాంటి ఏర్పాట్లు, ఖర్చు చేయలేదు. కానీ కుమారస్వామి ప్రమాణానికి మాత్రం రాష్ట్ర ఆతిథ్య సంస్థ రెండు ఫైవ్ స్టార్ హోటళ్లలో అతిథులకు బస ఏర్పాటు చేసింది. మే 23, 24 తేదీలలో విశిష్ట అతిథుల కోసం తాజ్ వెస్ట్ ఎండ్, షాంగ్రీలాలో బస ఏర్పాటు చేసిన ఆతిథ్య సంస్థ అందుకు చెల్లించిన మొత్తం రూ.37,53,536.  మే 23న విధానసౌధ బ్యాంకెట్ హాల్ లో ఇచ్చిన తేనీటి విందుకైన ఖర్చు రూ.4,35,001 మాత్రమే. ఇక్కడ టీ, ఆహార పదార్థాలను సరఫరా చేసింది తాజ్ వెస్ట్ ఎండ్ హోటలే.

బీజేపీయేతర ముఖ్యమంత్రులతో కలిపి మొత్తం 42 మంది అగ్రనేతలను హెచ్.డి.కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జీ. పరమేశ్వర ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు.  తమిళ రాజకీయాల్లో కొత్తగా ఆరంగేట్రం చేసిన నటుడు కమల్ హాసన్ తాజ్ వెస్ట్ ఎండ్ లో చేసిన ఖర్చు మొత్తం రూ.1,02,040గా తేలింది.

ఎవరెవరు ఎంత ఖర్చు?

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ : రూ.1,02,400
బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి : రూ.1,41,443
కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ : రూ.1,02,400
కాంగ్రెస్ అగ్రనేత అశోక్ గెహ్లాట్ : రూ.1,02,400
సీపీఎం నేత సీతారామ్ ఏచూరి : రూ. 64,000
జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ : రూ.38,400
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ : రూ.64,000
ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ : రూ.38,400
జార్ఖండ్ మాజీ సీఎం బాబులాల్ మరాండీ : రూ.45,952

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖర్చు వివరాలను రాష్ట్ర ఆతిథ్య సంస్థ ఇవ్వలేదు.

ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన భారీ ఖర్చుపై బెంగుళూరు పౌర సమాజం మండిపడుతోంది. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు డబ్బు లేదంటున్న ప్రభుత్వం ఇంత మొత్తం ఎలా ఖర్చు పెట్టిందని కర్ణాటక మాజీ లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డే ప్రశ్నించారు.

పార్టీ ఆహ్వానించినపుడు... అతిథుల ఖర్చు కూడా పార్టీనే భరిస్తే ఈ విమర్శలు వచ్చేవి కావు. కాని పార్టీ చేసిన ఖర్చును ప్రభుత్వం భరించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.