హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫలితాలు సూపర్‌

 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫలితాలు సూపర్‌

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మరోసారి ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రై మాసికంలో బ్యాంక్‌ రూ. 5,805 కోట్ల నిరక లాభం వస్తుందని మార్కెట్‌ అంచనా వేయగా, రూ. 5,885 కోట్ల నికర లాభాన్ని బ్యాంక్‌ ప్రకటించింది. బ్యాంక్‌ డైరెక్టర్ల బోర్డు ఇవాళ సమావేశమై కంపెనీ ఫలితాలకు ఆమోదం తెలిపింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే  బ్యాంక్‌ నికర లాభం 22.63 శాతం పెరిగింది.  బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం 22.8 శాతం పెరిగి రూ. 13,089 కోట్లకు చేరింది. సగటు ఆస్తుల వృద్ధి రేటు 19.8 శాతంగా ఉన్నట్లు  బ్యాంక్‌  ఒక ప్రకటనలో పేర్కొంది. డిపాజిట్లపై ఇచ్చే వడ్డీకి, రుణాలపై వసూలు చేసే వడ్డీ వ్యత్యాసమే నికర వడ్డీ. ఈ వడ్డీ మార్జిన్‌ ఈ త్రైమాసికంలో 4.4 శాతంగా ఉంది. నిరర్థక ఆస్తుల కేటాయింపు మాత్రం స్వల్పంగా పెరిగింది. గత ఏడాది ఈ పద్దు కింద రూ. 1,541 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది చివరి త్రైమాసికంలో రూ. 1,889 కోట్లకు చేరింది. అయితే స్థూల ఎన్‌పీఏల శాతం 1.38 శాతం నుంచి 1.36 శాతానికి తగ్గింది. ఒక్కో షేర్‌కు రూ. 15 డివిడెండ్‌ ఇవ్వాలని బ్యాంక్‌ డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది.